ములుగు, వెలుగు: మేడారం మహాజాతరలో ఫోన్లు కలవకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతరలో ప్రాంగణంలో వివిధ నెట్‌వర్క్ సంస్థలు సుమారు 40 టవర్లను ఏర్పాటు చేశాయి. కానీ సిగ్నల్ ఉన్నట్లు చూపిస్తున్నా.. ఫోన్లు మాత్రం కలవడం లేదు. కాల్స్ చేయడానికి, నెట్ సేవల కోసం భక్తులు ఎత్తైన భవనాల పైకి ఎక్కుతున్నారు.
టవర్ల పరిధిలో పరిమితికి మించి భక్తులు ఉండడంతో ఇలాంటి సమస్య ఎదురవుతుందంటూ ఆయా నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఫోన్లు కలవకపోవడంతో భక్తులు తమ బంధువులు, కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫోన్లు పనిచేయకపోవడంతో చాలా మంది.. మిస్సింగ్ కేంద్రాలకు వెళ్లి తమ బంధువుల పేర్లను అనౌన్స్ చేయిస్తున్నారు.
ఇదిలా ఉండగా మేడారం మహా జాతర ఘనంగా జరుగుతోంది. మేడారం గద్దెలపై వన దేవతలు కొలువుదీరారు. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా.. గురువారం తల్లి సమ్మక్క రాకతో భక్తులు పులకించిపోయారు. ‘జై సమ్మక్క.. జైజై సారక్క’ అంటూ తల్లులను తలుచుకున్నారు. చిలుకలగుట్ట నుంచి దిగివచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయజయధ్వానాలతో స్వాగతం పలికారు.
తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరపగా.. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగురవేసి, యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు.
సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో జెండా గుట్టకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు (కంకవనం)ను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. సమ్మక్క, సారలమ్మల గద్దెలపై పసుపు, కుంకుమ, చీరెసారెలు సమర్పించి పూజలు చేశారు.
