హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో జన జాతర కొనసాగుతోంది. సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై ఆసీనులు కావడంతో వరాల తల్లులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిలువెత్తూ బంగారం (బెల్లం) సమర్పించి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
గంటగంటకు భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది. కొత్తగా నిర్మించిన క్యూ లైన్ కాంప్లెక్స్ నిండిపోవడంతో జనం రోడ్డుపైన కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిల్చున్నారు. శుక్రవారం (జనవరి 30) జాతర మూడో రోజు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పొటెత్తడంతో మేడారం జన సంద్రమైపోయింది.
జంపన్న వాగు నుంచి సమ్మక్క, సారలమ్మల గద్దెల వరకు ఇసుకేస్తే రాలనంతా జనంతో మేడారం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం మేడారంలో ఎక్కడ చూసిన జనమే కనిపిస్తున్నారు. ఓ వైపు భక్తుల జై సమ్మక్క, సారలమ్మల నినాదాలు.. మరోవైపు శివసత్తుల పూనకాలతో మేడారం హోరెత్తుతోంది. లక్షల సంఖ్యలో తరలి వస్తుండటంతో మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
