కశ్మీర్‌పై పోస్టులు : షీలా రషీద్‌పై క్రిమినల్ కంప్లయింట్

కశ్మీర్‌పై పోస్టులు : షీలా రషీద్‌పై క్రిమినల్ కంప్లయింట్

ఢిల్లీ : కశ్మీర్ లో పరిస్థితులపై జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు, కశ్మీర్ సోషల్ యాక్టివిస్ట్  షీలా రషీద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. దేశ వ్యతిరేకతను పెంచేవిధంగా, కశ్మీర్ లో యువతను పక్కదారి పట్టించేలా, ప్రపంచ దేశాలకు భారత్ పై తప్పుడు అభిప్రాయం కలిగేలా.. షీలా రషీద్ ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయంటూ.. ఆమెపై క్రిమినల్ కంప్లయింట్ ఫైల్ అయింది. సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాత్సవ .. షీలా రషీద్ పై ఢిల్లీ పోలీసులకు క్రిమినల్ కంప్లయింట్ చేశారు.

జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ… ఆగస్ట్ 18న ట్విట్టర్ లో 10 అంశాలను పోస్ట్ చేశారు షీలా రషీద్. కశ్మీర్ లో స్థానికుల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు పెట్టారని, స్థానిక మీడియాను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. గ్యాస్ ఏజెన్సీలు క్లోజ్ అయ్యాయనీ.. వంట గ్యాస్, నిత్యావసరాలు, మందులు, చిన్నపిల్లలకు అవసరమైన ఆహారం, పాలు దొరకడం లేదని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోవడం వల్ల ఇంటర్వ్యూ నోటిఫికేషన్స్ కూడా అందుకోలేకపోతున్నారని అన్నారు. డీ2హెచ్ రీచార్జ్ అందుబాటులో లేకపోవడం వల్ల.. టీవీలో వార్తలను స్థానికులు చూడలేకపోతున్నారని… తానే కొందరికి చేసి ఇచ్చానని తెలిపారు. కశ్మీర్ లో స్థానిక పోలీసులకు పవర్స్ లేకుండా పోయాయనీ.. పారామిలటరీ , సీఆర్పీఎఫ్ బలగాలకే అథారిటీ ఉందని చెప్పారు. రాత్రివేళ స్థానికుల ఇళ్లలోకి ఆయుధాలతో సైనికులు చొరబడుతున్నారనీ…  బియ్యం పారపోసి.. వాటిని ఆయిల్ తో మిక్స్ చేసి పాడు చేస్తున్నారని అన్నారు. షోపియాన్ లో నలుగురిని ఆర్మీ క్యాంప్ లోకి తీసుకెళ్లిన సైనికులు.. వారిని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని.. టార్చర్ పెట్టారని షీలా రషీద్ ఆరోపించారు. దగ్గరగా ఉన్న ఓ మైక్ ద్వారా వారి అరుపులు అందరికీ వినిపించాయని షీలా రషీద్ చెప్పారు.

షీలారషీద్ చేసిన కామెంట్స్ పై సుప్రీంలాయర్ శ్రీవాత్సవ తీవ్రమైన అభ్యంతరం చెబుతూ.. ఆమెపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైన్యం, భారత ప్రభుత్వంపై ఆమె ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో చెప్పారు. ఆమె ట్వీట్స్ ను విదేశాల్లో ఉన్నవారు ఇంటర్నేషనల్ సోషల్ ప్లాట్ ఫామ్స్ లో రీట్వీట్ చేయడం ద్వారా.. భారత గౌరవానికి కోలుకోలేని గాయం తగులుతోందని అన్నారు సుప్రీలాయర్. ఇది దేశంపై విద్వేషాన్ని రెచ్చగొట్టడమే అనీ.. ప్రైమా ఫసీ(ప్రాథమిక విచారణ)ని అనుసరించి ఆమెపై ఐపీసీ 124ఏ సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెక్షన్లు 153, 153 ఏ, 504, 505, 2002 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద ఆమెపై కేసులు పెట్టాలని ఆయన కోరారు.

అరెస్టు వార్తలపై షీలా రషీద్ స్పందన

మరోవైపు.. తనను అరెస్ట్ చేస్తారన్న వార్తలొస్తున్నాయని… ఐతే.. ఎవరూ అధైర్యపడొద్దని షీలా రషీద్ తాజాగా వరుస ట్వీట్లు చేశారు. ప్రజాస్వామ్యంలో అణచివేతను ప్రశ్నించడం మానొద్దని ఆమె తన ట్వీట్లలో హితవు పలికారు.