కోర్టు వద్దంటున్నా..నేర చరిత్ర ఉన్నోళ్లకు టికెట్లా? : ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్​

కోర్టు వద్దంటున్నా..నేర చరిత్ర ఉన్నోళ్లకు టికెట్లా? : ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్​

ఖైరతాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 226  మందికి నేరచరిత్ర ఉందని ఫోరమ్ ఫర్​గుడ్ ​గవర్నెన్స్ ​అధ్యక్షుడు ఎం. పద్మ నాభరెడ్డి తెలిపారు. నేర చరిత్ర ఉన్నవారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని కోర్టు చెప్పిందని, అయినా పార్టీలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న 360 మందిలో 226 మందికి నేరచరిత్ర ఉన్నట్లు ఆయన తెలిపారు. 

ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పద్మనాభరెడ్డి మాట్లాడారు. నేర చరిత్ర నమోదైన వారిలో  కొందరిపై భూ కబ్జా కేసులు ఉన్నాయని చెప్పారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు లొంగొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ధనబలం ఉన్నవారికే ప్రధాన పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయని, నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని సుప్రీం కోర్టులో పిల్​వేస్తే.. తాము చట్టం చేయలేమని, పార్లమెంట్, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని చెబుతూ కోర్టు కొన్ని సూచనలు చేసిందని పేర్కొన్నారు. 

అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 58 మంది, బీజేపీలో 78 మందిపై, కాంగ్రెస్​పార్టీ అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్​ కేసులున్నాయని ఆయన వెల్లడించారు. సంస్థ ఉపాధ్యక్షుడు టి.వివేక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​రెడ్డి, కోశాధికారి ఎన్.శ్రీదేవి, సభ్యుడు పి.భాస్కర్​రెడ్డి పాల్గొన్నారు.