18 ఏళ్లకు హత్య...గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ నేర చరిత్ర

18 ఏళ్లకు హత్య...గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ నేర చరిత్ర

ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ , మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , అతని సోద‌రుడు అష్రఫ్ల కాల్చివేత గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏప్రిల్ 15వ తేదీన ఉత్తర్ ప్రదేశ్లో  ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో... అతిక్ అహ్మద్ ఎవరు... ఆయన నేర ప్రస్తానం ఏంటి అనే చర్చ దేశ వ్యాప్తంగా నడుస్తోంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ప్రయాగ్ రాజ్లో  తిరుగులేని వ్యక్తిగా చలామణి అయ్యాడు అతిక్ అహ్మద్. అక్కడ తన మాటంటే శాసనం. కాదన్న వారిని హతమర్చడమే అతిక్ స్టైల్. అందుకే ప్రయోగరాజ్ లో అతిక్..ఓ నియంతలా ఎదిగాడు. ఆ తర్వాత రాజకీయాలోకి అడుగుపెట్టిన అతిక్....మరిన్ని దారుణాలకు పాల్పడ్డాడు.  ఉమేష్ పాల్ హత్యకేసు మొత్తం కుట్రను జైలులో ఉండగానే రచించాడు. అతిక్ సూచనల మేరకే ఉమేష్ పాల్‌పై కాల్పులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఆదిత్య యోగి ప్రభుత్వం ఏర్పడ్డాక..అతిక్ ఆటలు సాగలేదు. నిత్యం బయపడుతూ కాలం వెళ్లదీశాడు. ఎక్కడ ఎన్ కౌంటర్ అవుతానో అని.. యూపీ నుంచి పారిపోయాడు. నియంతలా బతికి వ్యక్తి ఏప్రిల్ 15వ తేదీ దారుణ హత్యకు గురయ్యారు.

18 ఏళ్లకే  హత్య

యూపీలోని అలహాబాద్‌లో 1962లో  అతిక్ అహ్మద్  జన్మించాడు. అతని తండ్రి బతుకుదెరువు కోసం టాంగా  నడిపేవాడు. డబ్బు మీద వ్యామోహంతో చిన్నతనం నుంచే అతిక్ చెడు దారి వైపు వెళ్లాడు. దొంగతనాలకు పాల్పడ్డాడు. తప్పుడు మార్గంలో వసూళ్లకు దిగాడు. కేవలం 18 ఏండ్ల వయసులోనే అతిక్ హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలహాబాద్ పాతబస్తీలో చాంద్ బాబా డాన్ గా వ్యవహరించాడు. ఈ సమయంలో ప్రజలు చాంద్ బాబా భయాన్ని వీడాలని పోలీసులు, నాయకులు కోరేవారు. అదే సమయంలో అతిక్ అహ్మద్‌కు పోలీసులు.., రాజకీయ నాయకులు అండ దొరికింది.  ఆ తర్వాత అతిక్ అలహాబాద్లో  భూకబ్జా సిండికేట్ కు డాన్ గా ఎదిగాడు.  ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా కేసుల్లో  ఆధారాలు లేకపోవడం.., బాధితుతలు అతిక్ అహ్మద్ భయానికి ఫిర్యాదు చేయకపోవడంతో  అతిక్ మరింత రెచ్చిపోయాడు. 

అతిక్ కోసం కౌంట్ డౌన్..

1995 జూన్‌లో లక్నోలోని గెస్ట్‌హౌస్ లో మాయావతిపై దాడి చేసిన  ఘటనలో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే ఈ కేసులో  మాయావతి పలువురు నిందితులను క్షమించినా..అతిక్ అహ్మద్‌ను విడిచిపెట్టలేదు. మాయావతి అధికారంలోకి వచ్చాక ..అతిక్ అహ్మద్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంది. అతని ఆస్తులను ధ్వంసం చేసింది. మాయావతి ప్రభుత్వం అతిక్ కార్యాలయాన్ని కూల్చివేసింది. అతని ఆస్తులు జప్తు చేసింది. ఆ తర్వాత అతిక్ ను  జైలుకు పంపింది.  ప్రయాగ్‌రాజ్‌లోఅతిక్ ను పూర్తిగా నాశనం చేసింది. 

రాజకీయాల్లోకి ... 

అతిక్ 27 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. ఇదే స్థానం నుంచి  సమాజ్ వాదీ(SP) పార్టీ నుంచివరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే అతిక్ నేరాలు మితిమీరడంతో ఎస్పీ దూరం పెట్టింది. దీంతో  అప్నాదళ్ లో చేరాడు. మళ్లీ 2004లో ఎస్పీలో చేరి పూల్పూర్ ఎంపీగా గెలిచాడు.  అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండానే అతిక్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో  ఉప ఎన్నిక వచ్చింది.  ఈ స్థానంలో ఎంపీ అతిక్‌ అహ్మద్‌ తమ్ముడు అష్రఫ్‌ను ఎస్పీ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ బహుజన సమాజ్ పార్టీ  రాజు పాల్‌ను తమ అభ్యర్థిగా పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజు పాల్ ..అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌ను ఓడించారు.

 
రాజు పాల్ హత్య ..

అలహాబాద్ పశ్చిమ  నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అష్రఫ్‌ ఓటమి పాలవడంతో అతీక్‌ అహ్మద్‌ శిబిరంలో కలకలం రేగింది. కొద్ది రోజుల తర్వాత  ఎమ్మెల్యే  రాజుపాల్  2005 జనవరి 25న హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాజ్ పాల్ తో పాటు దేవి పాల్, సందీప్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంచలన హత్య యూపీ రాజకీయాల్లో కలకలం రేపింది.  ఈ కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ పేర్లు  తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రాజుపాల్ భార్య పూజా పాల్ మన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..హత్యపై విచారణ అనంతరం అతిక్ అహ్మద్, అతని సోదరుడు సహా 11 మందిపై  చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తుపై రాజుపాల్ కుటుంబం సంతృప్తి చెందకపోవడంతో  సీబీసీఐడీకి అప్పగించారు. ఈ హత్య కేసులో బలమైన సాక్షాలు దొరకడంతో అతిక్ పతనం ప్రారంభమైంది. 

2009 లో ఐదుగురు నిందితులపై సిబి-సిఐడి అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. కానీ రాజు పాల్ కుటుంబం విసుగు చెంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో  ...ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. 20 ఆగస్టు 2019 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజుపాల్ హత్యకేసులో సీబీఐ  దర్యాప్తు ప్రారంభించింది. మూడేళ్ల విచారణ తర్వాత నిందితులపై సీబీఐ చార్జిషీటు వేసింది.  విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కవితా మిశ్రా ఆరుగురు నిందితులపై అభియోగాలు మోపారు. ఈ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే అష్రఫ్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు సహా మరికొందరు పాల్గొన్నారని...నిందితులందరిపై హత్య, హత్యకు కుట్ర, హత్యాయత్నం వంటి అభియోగాలు మోపారు.  2006లో సాక్షి అయిన ఉమేష్ పాల్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఈ కేసులో అతిక్ కు జీవితఖైదు పడింది.