
- ట్విట్టర్లో ప్రతి గింజ కొనేదాకా కొట్లాడుతం
- కాంగ్రెస్ నేత రాహుల్ రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేయొద్దు: కవిత
- మీ ఎంపీలు కొట్లాడుతలే..బిర్యానీలు తినుకుంట టైంపాస్ చేస్తున్రు: మాణిక్కం
- తెలంగాణపై దొంగప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి: హరీశ్
- ‘మామ కోసం అల్లుడి ఆరాటం’ అంటూ హరీశ్‌పై రేవంత్ సెటైర్
- కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
- నిజాయితీ ఉంటే మద్దతియ్యండి
రాహుల్ గాంధీ.. మీరు ఎంపీగా ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ పార్లమెంట్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేయండి. ఒక దేశం ‑ ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి.
‑ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైతుల శ్రమతో రాజకీయమా?
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో.. అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మానుకుని, పండించిన ప్రతి గింజ కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేదాకా, రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.
‑ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై ట్విట్టర్‌లో వార్ నడుస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌తో లొల్లి మొదలైంది. రైతుల శ్రమతో రాజకీయం తగదని రాహుల్ ట్వీట్ చేయగా.. దానికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేయకుండా.. పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణపై దొంగప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలంటూ మండిపడ్డారు. దీంతో ఎంటరైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోందంటూ హరీశ్‌ను విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ లీడర్లకు కౌంటర్లు ఇచ్చారు. రోజంతా ట్వీట్ల పంచాయితీ కొనసాగింది. ప్రెస్‌మీట్లు పెట్టి పరస్పరం విమర్శలు చేసుకునే దాకా వెళ్లింది.
మీ పార్టీ స్టాండ్ ఏంటి?: హరీశ్
రాహుల్ గాంధీ ట్వీట్‌పై రియాక్ట్ అయిన హరీశ్‌రావు.. రాష్ట్ర ప్రజల మేలు కోరుకునే వాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘‘రాహుల్ జీ.. ఈ దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించే అవకాశం మీ పార్టీకి లభించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలు ఉన్నాయి. 50 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పని సీఎం కేసీఆర్ ఏడేండ్లలో చేసి చూపించారు. 24 గంటల ఉచిత కరెంట్, సాగునీటి సౌకర్యం కల్పించి వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకువచ్చారు” అని వివరించారు. విమర్శలు తమపై కాకుండా తెలంగాణ నుంచి బియ్యం సేకరించడానికి నిరాకరించిన కేంద్రంపై చేయాలని సూచించారు. తప్పుడు సమాచారంతో రాహుల్‌ను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు.రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే పనిచేయాలని హరీశ్ హితవు పలికారు. ‘వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్’ విధానంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో పరువు తీసుకోవద్దని హితవుపలికారు.
ఆ సంతకమే ఉరితాడు అయ్యింది: రేవంత్
రాహుల్ ట్వీట్‌పై కవిత, హరీశ్ స్పందించగానే.. సీన్‌లోకి రేవంత్ ఎంటరయ్యారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని, సెంట్రల్ హోల్‌లో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. కేసీఆర్ ఆ రోజు సంతకం చేయడమే ఈనాడు తెలంగాణ మెడకు ఉరితాడు అయ్యింది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు’’ అని కవితకు కౌంటర్ ఇచ్చారు. తర్వాత హరీశ్ విమర్శలపై స్పందిస్తూ.. ‘‘మామ చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోంది. భవిష్యత్‌లో పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి. మా పార్టీ సెంట్రల్ హాల్‌లో ఫొటో షూట్ చేయదు.. రైతుల కోసం నిఖార్సైన ఫైట్ చేస్తుంది’’ అంటూ బదులిచ్చారు. రాష్ట్ర రైతుల ఆవేదన అర్థం చేసుకొని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన తమ నేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
రాజీనామాకు సిద్ధమా?: కోమటిరెడ్డి
రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తే తాము పదవులు వదులుకుంటామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తన సవాల్‌కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ ట్వీట్‌లో ఏం తప్పుంది?: మల్లు రవి
రాహుల్ ట్వీట్‌లో ఎక్కడ తప్పు ఉందో కవిత చెప్పాలని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ప్రశ్నించారు. మిల్లర్ల కోసమే కవిత, టీఆర్‌ఎస్ నేతల ఆరాటం తప్ప రైతులపై వారికి ప్రేమ లేదన్నారు. కేంద్రం వడ్లు కొని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ‘పాస్‌పోర్ట్ కుంభకోణంలో ముద్దాయి కేసీఆర్ కూతురు నువ్వు’ అని కవితను ఉద్దేశించి అన్నారు. అవినీతిలో కేసీఆర్ నంబర్ వన్ అని ఆరోపించారు.
రాహుల్ నాన్సెన్స్.. రేవంత్ న్యూసెన్స్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
రాహుల్ నాన్సెన్స్, రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని.. రైతులపై వాళ్లది మొసలి కన్నీరు మాత్రమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే.. వడ్లు కొనాలని పార్లమెంట్‌లో ప్రధాని మోడీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్ ఐరన్ లెగ్‌లు అని, వాళ్లు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమేనన్నారు. యూపీ, పంజాబ్‌లో రాహుల్.. హుజూరాబాద్‌లో రేవంత్ ఐరన్ లెగ్‌లు అన్న విషయం తేలిపోయిందన్నారు. రాష్ట్ర బీజేపీలో ట్రిపుల్‌ఆర్.. కాంగ్రెస్‌లో డబుల్‌ఆర్ (రాహుల్, రేవంత్) దేశానికి, ప్రజలకు పట్టిన దరిద్రమని అన్నారు. రైతులతో పెట్టుకున్నోడు.. కేసీఆర్‌తో గోక్కున్నోడు బాగుపడలేదన్నారు.
మాణిక్కం కామెంట్లకు కవిత కౌంటర్
కవిత ట్వీట్లపై స్పందించిన మణిక్కం ఠాగూర్.. మాజీ ఎంపీలను పార్లమెంట్ లోపలికి అనుమతించబోరని.. అందుకే మీరు పార్లమెంట్‌లోకి రాలేరని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలపడం లేదని, సెంట్రల్ హాల్‌లో ఢోక్లా, బిర్యానీ ఆస్వాదిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఈ కామెంట్లపై తీవ్రంగా
స్పందించిన కవిత.. ‘‘గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల్లోనే ఉంటా. మణిక్కం ఠాగూర్ దురహంకారమే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని రెండంకెల సంఖ్యకు దిగజార్చింది” అని ఫైర్ అయ్యారు. ‘వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్‌మెంట్’ విధానంపై రాహుల్ వైఖరేంటో చెప్పాలని నిలదీశారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షమే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పండిన చివరి గింజ కొనేవరకు పోరాడుతామని, నిలదీస్తామని తేల్చిచెప్పారు.
అధికార అహంకారంతో మాట్లాడ్తరా?: దాసోజు శ్రవణ్
రాహుల్ గాంధీ రైతుల పక్షాన ట్వీట్ చేస్తే.. అధికార అహంకారంతో ఆయనపై కామెంట్స్ చేస్తారా అని ఎమ్మెల్సీ కవితను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తామని.. దళిత సీఎం.. కేజీ టు పీజీ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో హామీలను నిలబెట్టుకోని మీకు నిజాయితీ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఐకేపీ కేంద్రాలు పెట్టమంటే ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నరు. వరి వేస్తే ఉరి అన్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. తెలంగాణలో ‘రైతు రాహుల్ రణం’ అనే ట్రిపుల్‌ఆర్ పోరాటం మొదలైందని, టీఆర్‌ఎస్ ఎంపీలు డ్రామాలు బంద్ చేసి పదవులకు రాజీనామా చేయాలన్నారు.