అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. ఇది క్యాలెండర్‌లోని ఒక సాధారణ తేదీ కాదు, ఒక జాతి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సజీవ ప్రతీక. 1952లో బెంగాలీ భాషా ఉద్యమంలో మాతృభాష కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్మృత్యర్థం యునెస్కో ఈ రోజును ప్రకటించింది. అయితే, అంతటి గొప్ప ఉద్యమం నుంచి పుట్టిన ఈ వేడుకను కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం చేసి చూడటం భావ్యం కాదు.
భాష అంటే గుండెలో దాచుకునే భావోద్వేగమో లేదా సరిహద్దుల మధ్య బందీ అయ్యే వస్తువో కాదు. కన్నతల్లి వంటి మాతృభాషను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టడమే ఈ అంతర్జాతీయ వేడుకకు మనం ఇచ్చే అసలైన గౌరవం. మన ప్రాంతీయ మూలాలను కాపాడుకుంటూనే ప్రపంచ భాషా వేదికపై తెలుగు జెండాను ఎగురవేయాలి. భాషా భిమానం అనేది ప్రతి మనిషి హృదయంలో అంతర్లీనంగా ఉండే ఒక సహజమైన భావన. ఆ భావనే ఒక జాతిని ఏకం చేస్తుంది, వారి సంస్కృతిని సజీవంగా ఉంచుతుంది.
తెలుగును కేవలం మన రాష్ట్రాల సరిహద్దులకే పరిమితం చేయడం అంటే.. మన భాషా వైభవాన్ని మనమే తక్కువ చేసుకోవడం. నిజానికి మన సాహిత్య పరిమళం ప్రాచీన కాలం నుంచే భౌగోళిక ఎల్లలు దాటి విస్తరించింది. నన్నయ్య ఆంధ్ర మహాభారత రచనను ప్రారంభించినప్పుడు అది తెలుగు జాతి ఆలోచనా సరళిని ప్రతిబింబించేలా సాగింది. ఆయన మన భాషా పరిధిని ఆనాడే విశ్వవ్యాప్తం చేశారు.
తెలుగు భాషా వ్యాప్తిని చరిత్ర పుటల్లో వెతికితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 11వ శతాబ్దంలో నన్నయ్య కాలానికి భారతదేశం నేటిలా ఒకే పరిపాలన కింద లేదు. అది చిన్న చిన్న రాజ్యాల కలయిక. ఆనాడు తెలుగు భాష వేర్వేరు రాజ్యాల్లో, రకరకాల సంస్కృతుల మధ్య నడిచేది. ఆనాటి పరిస్థితులను బట్టి చూస్తే, తెలుగు అప్పట్లోనే ఒక ప్రపంచ భాషగా వెలుగొందిందని చెప్పవచ్చు.
ప్రపంచస్థాయి తెలుగు రచనలు
తెలుగులో ప్రపంచస్థాయికి చేరుకోదగ్గ రచనలు ఎన్నో ఉన్నాయి. కానీ, అవి కేవలం మన ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. నిజానికి ‘మాండలికం’ అనే పదాన్ని తక్కువ చూపుతో చూడకుండా, మన భాషా విస్తృతిగా గౌరవించాలి. అన్ని ప్రాంతాలలోని పదాలను కలిపి ఒక బృహత్ నిఘంటువుగా మలిస్తే ప్రపంచంలో ఏ భాషకూ లేనంతటి పద సంపద మన సొంతమవుతుంది.
దురదృష్టవశాత్తూ, ఈ వైవిధ్యాన్ని ఒక శక్తిగా మార్చుకోవడంలో మన విద్యా వ్యవస్థ వెనకబడి ఉంది. ఈ విశాలమైన ఆలోచన మన విశ్వవిద్యాలయాల్లో కూడా కనిపించడం లేదు. ఆంగ్ల విభాగాల్లో లోకంలోని అన్ని దేశాల సాహిత్యాలను చదువుతూ, వాటన్నింటినీ ‘ఆంగ్ల సాహిత్యం’ అని గౌరవిస్తారు. కానీ మన దగ్గర మాత్రం ప్రాంతీయత పేరుతో గొప్ప రచనలను పట్టించుకోవడం లేదు. నన్నయ్య చూపిన బాటలో మనం ప్రపంచ వేదిక వైపు సాగాలి.
ఆంగ్లాన్ని ఒక సాధనంగా వాడుకోవాలి
తెలుగు వెలుగు ప్రపంచమంతా ప్రసరించాలంటే ‘అనువాదం’ అనే కిటికీలను తెరవాలి. భాషా సంస్కృతులు ఈ రోజుల్లో కేవలం భావోద్వేగాలకు సంబంధించినవి మాత్రమే కావు, అవి ఒక దేశపు తిరుగులేని సాంస్కృతిక శక్తి. మన యోగ శాస్త్రాన్ని ఆంగ్ల మాధ్యమంలోకి అనువదించి ప్రపంచానికి అందించడం వల్లే అది నేడు అంతర్జాతీయ జీవనశైలిగా రూపాంతరం చెందింది. అలాగే మన ‘పంచతంత్రం’ కథలు పరభాషల్లోకి వెళ్లడం వల్లే విశ్వవ్యాప్త ప్రాచుర్యం పొందాయి.
రవీంద్రుని ‘గీతాంజలి’కి నోబెల్ బహుమతి లభించిందంటే, దానికి ప్రధాన కారణం ఆయన తన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచం ముందు నిలబెట్టడమే. అదే బాటలో మన తెలుగు రచయితలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలంటే మన సాహిత్యానికి ఆంగ్ల అనువాదాలు అత్యవసరం. ‘తెలుగు’ అనే గొడుగు కింద అందరం ఒక్కటి కావాలి. తెలుగు అస్తిత్వాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడానికి ఆంగ్లాన్ని ఒక వంతెనగా వాడుకుందాం. మన భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం.
ఆచార్య వెంకటరామయ్య గంపా ఢిల్లీ యూనివర్సిటీ
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు
