చరిత్ర సృష్టిస్తారా?.. ఇయ్యాల ఆస్ట్రేలియాతో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ మూడో టీ20

చరిత్ర సృష్టిస్తారా?.. ఇయ్యాల  ఆస్ట్రేలియాతో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ మూడో టీ20

అడిలైడ్‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు విజయాలు సాధించినప్పటికీ.. మూడు ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఆసీస్‌‌‌‌‌‌‌‌తో జరిగే ఆఖరిదైన మూడో టీ20లో ఎలాగైనా గెలిచి కొత్త చరిత్రకు నాంది పలకాలని హర్మన్‌‌‌‌‌‌‌‌సేన రెడీ అయ్యింది. ఇది జరగాలంటే టీమిండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో మెరుగ్గా ఆడాలి. ముఖ్యంగా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపైనే ఇండియా భారీ స్కోరు ఆధారపడి ఉంది. కాన్‌‌‌‌‌‌‌‌బెర్రాతో పోలిస్తే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న అడిలైడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు పికప్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు ప్రయత్నించాలి.

అద్భుతమైన ఔట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఉండటం వల్ల ఈజీగా డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌ కొట్టొచ్చు.  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌, జెమీమా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు ఈ పిచ్‌‌‌‌‌‌‌‌ బాగా సరిపోతుంది. వీరిద్దరు బ్యాట్‌‌‌‌‌‌‌‌పైకి వచ్చే బాల్స్‌‌‌‌‌‌‌‌ను ఇష్టపడతారు. కాబట్టి క్రీజులో కుదురుకుంటే భారీ షాట్లు ఆడొచ్చు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌, అమన్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, దీప్తి శర్మపై ఒత్తిడి ఉంది. లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ కూడా కొన్ని రన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఆస్ట్రేలియన్లను అడ్డుకోవడానికి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పేసర్లు రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌, అరుంధతి రెడ్డి, అమన్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌కు కట్టుబడాలి. లేదంటే ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ల నుంచి ఇబ్బందులు తప్పవు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ శ్రీచరణిపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. మరోవైపు రెండో టీ20లో ఈజీగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన జార్జియా వోల్‌‌‌‌‌‌‌‌, బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌, ఎలైస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ, గార్డెనర్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో గార్డెనర్‌‌‌‌‌‌‌‌, కిమ్‌‌‌‌‌‌‌‌ గార్త్‌‌‌‌‌‌‌‌, సదర్లాండ్‌‌‌‌‌‌‌‌, సోఫీ మోనులిక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది.