బీఆర్ఎస్ జీరో ఇంపాక్ట్ వ్యూహాలు.. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఏంటంటే..

బీఆర్ఎస్ జీరో ఇంపాక్ట్ వ్యూహాలు.. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఏంటంటే..

అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేండ్ల సమయం ఉన్నా కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత, ఉన్న పార్టీల లోపాలు,  నాయకత్వ వైఫల్యాలపై.. ఇప్పుడే చర్చలు, విశ్లేషణలు, ఊహాగానాలు ఎందుకు జోరందుకుంటున్నాయి? 2023 అసెంబ్లీ  ఎన్నికల దగ్గర్నుంచి  సీఎం  రేవంత్  నాయకత్వంలో  జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో  బీఆర్ఎస్​ పదేండ్ల  వైఫల్యాలు,  తమ రెండేండ్ల పాలనపై ప్రచారం చేస్తూ కాంగ్రెస్ తనదైన విజయాల్ని సొంతం చేసుకుంటున్నది. బీజేపీపై  ప్రత్యామ్నాయ అంచనాలున్నా అర్బన్,   కోర్  అర్బన్  ఏరియాల్లో  జరిగిన  మున్సిపల్  ఎన్నికల్లోనూ  అంతగా  ఫలితాలను రాబట్టలేకపోయింది.

బీఆర్ఎస్,  బీజేపీలు  కలిసి కాంగ్రెస్  హామీల వైఫల్యాలపై  ప్రతి  ఎన్నికల్లో  బలంగా  ప్రచారం చేస్తున్నా  జనం  ఆ పార్టీలను  నమ్మడం లేదని  ఎన్నికల  ఫలితాలు రూఢీ  చేస్తున్నాయి.   కొట్లాడి  తెచ్చుకున్న  తెలంగాణ  రాష్ట్రంలో  సమర్థవంతమైన  ప్రతిపక్షం  లేకపోతే  అధికారపక్షం  నియంతృత్వ  ధోరణికి లోనవుతుందనడానికి  కేసీఆర్​ వ్యవహారాలు, 2023 అసెంబ్లీ ఫలితాలు రూఢీ చేశాయి. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించి  ప్రధాన ప్రతిపక్ష హోదాను  ప్రజలు కట్టబెడితే  ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి  ప్రజాసమస్యలపై  మాట్లాడిన పాపాన పోలేదు.

ఒకప్పుడు  ప్రతిపక్షం అంటే అసెంబ్లీలో  తార్కిక చర్చలు,  బయట  ప్రజాసమస్యలపై  రాజీలేని ఉద్యమాలు జరిగేవి.  ఒక జీవో  విడుదల చేయాలంటేనే  ప్రభుత్వం పదిసార్లు ఆలోచించేది.  కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిపక్షాలు  ప్రజల కోసం పోరాడటం కంటే  తమ ఉనికిని  కాపాడుకోవడమే  లక్ష్యంగా  మార్చుకుంటున్నాయి.  అధికార పక్షంపై  వ్యతిరేకత  పెంచితే చాలు,  తదుపరి  అధికారం  తమకే  దక్కుతుందనే  నెగటివ్ పాలిటిక్స్ భ్రమలో  విపక్షాలు  ఉన్నాయి. 

అభివృద్ధి  లోపాలను ఎత్తిచూపడం కంటే  వ్యక్తిగత  విమర్శలు,  అసత్య  ప్రచారాలు  ప్రధాన  అజెండాగా చేసుకుని రాజకీయాలు చేసే  విష సంస్కృతి రావడం దురదృష్టకరం.  రాష్ట్రంలో  అనేకానేక సమస్యలు  తాండవిస్తున్నాయి.  కేంద్రం  విభజన  హామీలు,  రాష్ట్ర  ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు,  ఇతరత్రా  ఒకటి  రెండు  అంశాలపై  మినహా చాలా సమస్యలపై  రోడెక్కిన  పాపాన పోలేదు.  ఇవాళ  బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్  కూతురు, జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవితలాగ కూడా   ప్రజా సమస్యసలపై  క్షేత్ర స్థాయిలో  స్పందించలేకపోతోంది.  

జీరో ఇంపాక్ట్
మున్సిపల్ ఎన్నికల్లో,  మేజర్  కార్పొరేషన్లలో  బీఆర్​ఎస్​ది  జీరో ఇంపాక్ట్.  2020లో  1,686 వార్డులు గెలిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్,  2026లో  781కి  పడిపోయింది. అలాగే  ఫోన్​ ట్యాపింగ్,  గొర్రెల స్కాం,  కాళేశ్వరం,  ఫార్ములా–-ఈ రేస్, ఇతర ఇన్వెస్టిగేషన్స్  కేటీఆర్, కవితలను బిజీ చేశాయి. ఇది పార్టీని డిఫెన్సివ్‌‌‌‌‌‌‌‌లోకి  నెట్టింది, అఫెన్సివ్ స్ట్రాటజీలు చేపట్టలేకపోయారు. 

ముఖ్యంగా సోషల్ మీడియా ఆధారిత ఆరోపణలు ఎక్కువ చేసి  గ్రౌండ్- లెవల్ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్స్ తక్కువ చేయడం వల్ల ‘కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్టివ్ అపోజిషన్’ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను  బలహీనపరిచింది. దీంతో  పార్టీ  ఇమేజ్​ దెబ్బతిని జూబ్లీహిల్స్ బైపోల్‌‌‌‌‌‌‌‌లో ఓటమి,  మున్సిపల్  ఎన్నికల్లో  మెజారిటీ  కార్పొరేషన్లలో  ఓటములు పార్టీని దెబ్బతీశాయి.  కేటీఆర్, హరీష్ లాంటి వాళ్లు  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ బలపడుతోందని చెప్పినా,  రియాలిటీలో కాంగ్రెస్ అర్బన్ ఏరియాల్లో  గ్రిప్  పెంచుకుంది. 

బూమ్​రాంగ్​ వ్యూహాలు
అసెంబ్లీ తర్వాత  జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఆ పార్టీకి  సున్నా  ఫలితాలొచ్చాయి.  2026  మున్సిపల్  ఎన్నికల్లోనూ  కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ 781 వార్డులకు మాత్రమే పరిమితమైంది.  ప్రధాన నగర కార్పొరేషన్లలో (కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం) బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  ప్రభావం చూపలేకపోయింది.  ఈ వైఫల్యాలకు  మూలకారణాలు అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక తప్పులపై విశ్లేషణ చేయకుండా  సోషల్ మీడియా ఆధారిత ప్రచారానికే పరిమితమైంది. 

అసెంబ్లీలో దూకుడు, బాయ్‌‌‌‌‌‌‌‌కాట్ అసెంబ్లీ సెషన్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం కొంత చేశారు. కానీ, కొన్ని సెషన్లలో బాయ్‌‌‌‌‌‌‌‌కాట్ చేయడం వల్ల చర్చలు జరగకుండా పోయాయి.  ఇది "ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజ్ అవుతామనే భయంతో ప్రీ-ప్లాన్డ్ ఎవేషన్" అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

రైతు సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా నీటి వివాదాలపై మాస్ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ప్లాన్ చేసినా, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా మౌనం పాటించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజ్ చేస్తాం, ప్రజలకు మంచి చేసినది గుర్తుచేస్తాం అని కేటీఆర్ చెప్పినా కానీ,  గత  పాలనలోని  కాళేశ్వరం,  ఫార్ములా- ఈ  రేస్​ కేసు, ఫోన్ ట్యాపింగ్,  గొర్రెల స్కాంలు బయటపడుతుండటం వల్ల.. ఇది బూమరాంగ్ అవుతోందని వెనక్కి తగ్గారని  అధికార పార్టీ  అడ్వాంటేజ్ తీసుకున్నది. 

సోషల్ మీడియా వర్సెస్​ క్షేత్ర స్థాయి పోరాటాలు
బీఆర్ఎస్  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయని రోజు లేదు. కానీ  ఒక్కదానిపై  కూడా  స్థిరంగా నిలబడి కొట్లాడటం లేదు. సోషల్ మీడియాలో 80%  రాజకీయ పోస్టులు పెయిడ్ వర్కర్లు,  బాట్స్ ద్వారా జరుగుతున్నాయి. అబద్ధాన్ని వందసార్లు చెబితే  నిజమవుతుందనే భ్రమలో ఉన్నాయి.  కానీ,  ప్రజల విచక్షణను  మరచిపోతున్నాయి. కేసీఆర్ సిట్ విచారణకు హాజరయితే రాష్ట్రం స్తంభించిపోయే నిరసనలను  కూడా చేపట్టలేకపోయారు. సోషల్ మీడియా ప్రచారం ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయి ఓటర్ల మనసు గెలవడం కష్టమవుతోంది.  తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమైన బీఆర్ఎస్ ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్లకు పరిమితమవుతోంది. 

రెండు పార్టీలు కలుస్తాయా ?
తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో  పొత్తులపై  మరోసారి  చర్చ జరుగుతున్నది. బీజేపీకి  చెందిన  ఒక  లోక్​సభ ఎంపీ,  బీఆర్ఎస్  ఎమ్మెల్యేతో  ఒకే కారులో  వెళ్లి  కాంగ్రెస్ ను  ఓడించేందుకే  తాము  బీఆర్ఎస్​తో  కలవాల్సిందన్న అనివార్యతను  బహిరంగంగానే  చెప్పేశారు. మరో బీజేపీ ఎంపీ కూడా అదే బాటలో ఓటు వేసేందుకు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకున్నారు. 

ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు నమోదు చేయించుకుని మరీ బీఆర్ఎస్ కు  ఓటు వేశారంటే  అది అంత ఆషామాషీ విషయం కాదు.  పొత్తులు,  ఎత్తులు,  సిద్ధాంతాలు,  నైతికతపై  పార్టీ అదిష్టానం వరకు విషయం వెళ్లింది.  స్థానికంగా బీఆర్ఎస్, బీజేపి కలిస్తేనే  కాంగ్రెస్​ను  ఓడించవచ్చన్న బలమైన వాంఛ ఆ ఎంపీలది. అయితే  తెలంగాణ  రాజకీయాల పట్ల సుదీర్ఘ అనుభవమున్న ఆ ఎంపీలు ఈ టైంలో పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు  ఓటింగ్​  చేశారంటే వారి వెనుకాల ఉన్న నిగూడార్థం ఏమిటి అని చర్చ జరుగుతోంది. 

బీజేపీ, బీఆర్​ఎస్​ స్నేహం చిగురించొచ్చని ఇప్పటికిప్పుడు ఊహించడం సరికాకపోవచ్చు. ముందుముందు ఏం జరుగుతుందనేదే చూడాలి. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రతిపక్ష వ్యూహం థియరీలో బలంగా ఉన్నా, ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌గా వైఫల్యమే. అంతర్గత ఐక్యత లేకపోవడం, కవిత రిబెలియన్, లీగల్ ఇష్యూస్, సోషల్ మీడియా ఆధారిత రాజకీయాలు ఇవి పార్టీని బలహీనపరిచాయి. 2028 ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఉద్యమాలు, యూనిఫైడ్ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్, నిర్మాణాత్మక ప్రతిపక్ష ఇమేజ్ పెంచుకోకపోతే, ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కవితలాంటి కొత్త శక్తులు ఈ శూన్యతను భర్తీ చేసే అవకాశం ఉంది.

ప్రతిపక్ష వైఫల్యంలో కేసీఆర్ పాత్ర ఎంత ?
ఉద్యమ  పునాదులపై పుట్టిన  బీఆర్ఎస్  అధికారం  కోల్పోగానే  పార్టీ  సమర్థవంతమైన  ప్రతిపక్ష హోదాను  నిర్వర్తించడం లేదు. ఆ పార్టీ నుంచి సస్పెన్షన్​కు గురైన  కేసీఆర్ కూతురు కవిత  సొంత పార్టీని కూడా  స్థాపించబోతున్నారు. రాష్ట్రంలో  ప్రతిపక్ష, రాజకీయ శూన్యత ఉందని ఆమె రోజూ అనేకానేక సమస్యలపై  రోడ్డెక్కుతున్నారు. మేలో పార్టీ  స్థాపించి  కామ్రెడ్స్​తో  కలిసి  పోటీ  చేస్తానని  చెబుతోంది. 

అంతేకాదు ఉద్యమాలు, తెలంగాణ  భావజాలం గల  లెఫ్ట్,   రైట్ నేతలను  కలుపుకుని ముందుకు సాగుతామని చెబుతున్నారు. కవితను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా లైట్  తీసుకుంటున్నా ఆమె వల్ల  గులాబీ పార్టీకి నష్టమే అన్నది బహిరంగ  రహస్యం. ఇక ఆమె  పార్టీ పెడితే  సక్సెస్ స్ట్రైక్ రేట్ ఎంత అన్న  చర్చ కాసేపు పక్కనపెడితే ‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  తెలంగాణ  ఆకాంక్షలను నెరవేర్చలేదు’ అని ఆమె చేసిన విమర్శలు పార్టీ  ఓటు బ్యాంకును చీల్చాయి. ఇది పార్టీని బలహీనపరిచిందని చెప్పాలి.

వెంకట్ గుంటిపల్లి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

 

NOTE : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ: openpage@v6velugu.com

  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు