కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యే సవాల్పై.. బహిరంగ చర్చకు కాంగ్రెస్ సై అనడంతో..

కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యే సవాల్పై.. బహిరంగ చర్చకు కాంగ్రెస్ సై అనడంతో..

కామారెడ్డి: కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న క్రమంలో ఈ వివాదం మరింత ముదిరింది. నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ చేశారు.

చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు కూడా సై అంటే సై అన్నారు. శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు  చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకొని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ నాయకులు,   కాలేజీ భూముల నుంచి  స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు సాక్ష్యాలతో రావాలని కోరారు.

డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు  తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్​ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్​ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది.  కాంగ్రెస్​, బీజేపీనాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు. ఇరు పార్టీల నాయకులు రానున్నట్లు పేర్కొన్న క్రమంలో ఉత్కంఠ నెలకొంది.