వాషింగ్టన్: తమ ప్రభుత్వం విధించిన గ్లోబల్ టారిఫ్‌లను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ తీర్పును ఆయన ‘ఒక అవమానం’ అని అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ అని, దేశ చరిత్రలోనే దురదృష్టకరమైన నిర్ణయమని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాలు విధించే అధికారం కేవలం 'కాంగ్రెస్'కే ఉంటుందన్న కోర్టు వాదనను ట్రంప్ యంత్రాంగం తప్పుబట్టింది.
1977 నాటి అత్యవసర చట్టం అధ్యక్షుడికి ఆ అధికారాన్ని ఇస్తుందని వాదిస్తోంది. అధ్యక్షుడిగా తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి తీసుకున్న అతిపెద్ద నిర్ణయానికి చుక్కెదురు కావడం ట్రంప్ అజెండా కు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
