మమ్మల్ని విమర్శిస్తే లాభం లేదు: మన్మోహన్‌‌ సింగ్‌‌

మమ్మల్ని విమర్శిస్తే లాభం లేదు: మన్మోహన్‌‌ సింగ్‌‌

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకోండి
370 రద్దుకు మేమూ సపోర్ట్‌‌ చేశాం: మన్మోహన్‌‌ సింగ్‌‌

ముంబై: ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మార్గాలు వెతక్కుండా  ప్రతిపక్షాలను విమర్శించడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ సర్కార్‌‌పై మాజీ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌  ఫైర్‌‌ అయ్యారు.   ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లను సరిచేయడానికి ముందుగా అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలి.. దానికి పరిష్కారాలు ఏమున్నాయో చూడాలని సూచించారు.  వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షాలను నిందించే పనిలో మాత్రమే  కేంద్రం తలమునకలై ఉందన్నారు. దీనివల్ల ఆర్థికవ్యవస్థ మళ్లీ గాడిలో పడేందుకు అవసరమైన పరిష్కారాలను కనుక్కోలేమన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌ గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు.  ఆర్టికల్‌‌ 370 రద్దును కాంగ్రెస్‌‌ పార్టీకూడా సమర్థించిన విషయాన్ని  ఆయన గుర్తుచేశారు.  రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌‌ ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)ను ప్రభుత్వం వాడుకోకూడదని ఆయన సూచించారు.   పలు కేసుల కింద ఎన్సీపీ లీడర్లు శరద్‌‌ పవార్‌‌, ప్రఫుల్‌‌  పటేల్‌‌ను ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో మన్మోహన్‌‌ కామెంట్స్‌‌ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్డీయే సర్కార్‌‌లో ఎప్పుడూ లేనంతగా ఈడీకి అధికారాలు దఖలు పడ్డాయని అన్నారు.

మన్మోహన్‌‌ సింగ్‌‌, ఆర్బీఐ మాజీ గవర్నర్‌‌ రఘురాం రాజన్‌‌ హయాంలో పబ్లిక్‌‌ సెక్టార్‌‌ బ్యాంకులు కష్టమైన పరిస్థితుల్ని  ఎదుర్కొన్నాయంటూ ఫైనాన్స్‌‌ మినిస్టర్‌‌ నిర్మాలా సీతారామన్‌‌ ఈమధ్య చేసిన కామెంట్స్‌‌ పై మాజీ ప్రధాని రియాక్ట్‌‌ అయ్యారు.  ఆర్బీఐ గవర్నర్‌‌గా  రాజన్‌‌ ఉన్నప్పుడు … నాయకులు ఫోన్‌‌ చేస్తేనే అప్పులు పుట్టాయని,  ఇప్పుడు ఆ మొండి బకాయిల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కూడా సీతారామన్‌‌ కామెంట్ చేశారు. హిందూ మహాసభ లీడర్‌‌  వీర్‌‌ సావర్కర్‌‌కు భారతరత్న  ఇచ్చేలా ప్రయత్నిస్తామన్న బీజేపీ ఎన్నికల హామీలపైనా మన్మోహన్‌‌ రియాక్ట్‌‌ అయ్యారు.  వీర్‌‌సావర్కర్‌‌ హిందుత్వ విధానాలను కాంగ్రెస్‌‌ వ్యతిరేకిస్తుందన్నారు.  ఆయన జ్ఞాపకంగా సావర్కర్‌‌ పోస్టల్‌‌ స్టాంప్‌‌ను ఇందిరాగాంధీ ఇష్యూ చేసిన విషయాన్ని  మాజీ ప్రధాని గుర్తుచేశారు.