హైదరాబాద్ లో మొసలి కలకలం... భయాందోళనలో జనం..

హైదరాబాద్ లో మొసలి కలకలం... భయాందోళనలో జనం..

జనావాసంలోకి వన్యప్రాణులు రావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఎక్కువగా చిరుతలు, ఏనుగులు, అడవి దున్నలు వంటి వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతుంటాయి. అయితే.. అడవికి దగ్గర ఉన్న ఊళ్లలోకి, శివారు ప్రాంతాల్లోకి వన్య ప్రాణులు రావడం సహజమే కానీ.. హైదరాబాద్ లాంటి నగరంలోకి వన్య ప్రాణులు వస్తే అది పెద్ద విషయమే. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లో మొసలి కలకలం రేపింది. 

 

శుక్రవారం ( అక్టోబర్ 10 ) అబ్దుల్లాపూర్ మెట్ లోని తారామతి పేట్ గ్రామంలో మొసలి జనావాసంలోకి రావడంతో జనం భయంతో వణికిపోయారు.తారామతి పేట్ గ్రామం నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా మొసలి గ్రామంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

జనావాసంలో మొసలి ప్రత్యక్షమవ్వడంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు మొసలిని బంధించి సురక్షితంగా మూసీ నదిలో వదిలేశారు.

వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తే బయపడొద్దని.. వాటిని కొట్టి  హాని కలిగించొద్దని సూచిస్తున్నారు అధికారులు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తే.. వాటిని సురక్షితంగా అడవిలోకి తరలిస్తామని తెలిపారు అధికారులు.