- లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలి: జాజుల
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆయన కోరారు.
మంగళవారం సికింద్రాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నిర్వహించడంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
సింగరేణి కార్మికుల తరహాలో ఆర్టీసీ కార్మికులకు కూడా లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో సగానికి పైగా బీసీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే వచ్చే మార్చి 10న బస్ భవన్ ను వేలమంది కార్మికులతో ముట్టడిస్తామని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ హెచ్చరించారు.
