- ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు ఎఫ్డీఏ ఆమోదం
- ఇప్పటికే ‘ఒజెంపిక్’ ఇంజక్షన్ మనదేశంలోనూ అందుబాటులోకి
- అదే మందుతో ట్యాబ్లెట్ తయారు చేసిన డెన్మార్క్ కంపెనీ
వాషింగ్టన్: మనుషుల శరీర బరువును తగ్గించేందుకు తయారు చేసిన ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ డీఏ) ఆమోదం తెలిపింది. ‘విగోవీ’ పేరుతో డెన్మార్క్ కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ నోవో నార్డిస్క్ తయారు చేసిన ఈ ట్యాబ్లెట్ వచ్చే నెల ప్రారంభంలోనే అమెరికాలో అందుబాటులోకి రానుంది. నోవో నార్డిస్క్ కంపెనీ ఇప్పటికే ‘ఒజెంపిక్’ పేరుతో వెయిట్ లాస్ ఇంజక్షన్ తయారు చేయగా, అది ఇండియాలో కూడా మెడికల్ యూజ్ కోసం అందుబాటులోకి వచ్చింది.
తాజాగా ట్యాబ్లెట్ తయారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వెయిట్ లాస్ థెరపీ సులభతరం కానుంది. విగోవీ పిల్ ను సెమాగ్లుటైడ్ 25ఎంజీ మందుతో తయారు చేశారు. జీఎల్పీ1 రిసెప్టార్లను లక్ష్యంగా చేసుకుని ఇది పని చేస్తుంది. ఈ మందు ఇప్పటికే ఇంజక్షన్ గా సక్సెస్ అయిన నేపథ్యంలో.. ట్యాబ్లెట్ రూపంలోని మందు మంచి ప్రత్యామ్నాయం కానుంది. ఒబెసిటీ, ఓవర్ వెయిట్ తోపాటు గుండె జబ్బులు ఉన్నవారికి ఈ మందుతో ప్రతికూల ప్రభావం ఉండదని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. ఎలా పని చేస్తుందంటే..
వెయిట్ లాస్ కు సంబంధించి జీఎల్పీ1 థెరపీ కోసం రూపొందించిన తొలి ఓరల్ పిల్ ‘విగోవీ’. ఇది శరీరంలో జీఎల్పీ1 హార్మోన్ మాదిరిగా పని చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుండె, కిడ్నీ ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో ఏదో ఒక కోమార్బిడిటీ (డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి) ఉన్నవారు దీనిని రోజూ ఒక ట్యాబ్లెట్ చొప్పున వాడటం ద్వారా 64 వారాల్లో 16.6% బరువు తగ్గారని, యావరేజ్ గా ప్రతి ముగ్గురిలో ఒకరు 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గారని నోవో నార్డిస్క్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న విగోవీ ఇంజక్షన్ ను వారానికి ఓసారి తీసుకున్నవారిలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయని తెలిపింది.
