- ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.239.37 కోట్ల ఫైన్లు
- సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వార్షిక నివేదిక వెల్లడి
- మహిళల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నం: సీపీ అవినాశ్ మహంతి
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో ప్రజల నుంచి నేరగాళ్లు దాదాపు రూ.1,650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఏర్పడిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్టు చేసింది. రూ.26.17 కోట్లు ఫ్రీజ్ చేసి ఆయా కంపెనీలకు చెందిన రూ.11.50 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. సైబర్ నేరాల్లోనూ బాధితులు రూ.404.61 కోట్లు కోల్పోయారు. ఇందులో రూ.54.67 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కాగా, ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు గత ఏడాది కంటే రెట్టింపుగా రూ.239.37 కోట్ల జరిమానా విధించారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం ఈ ఏడాది 37,243 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి మంగళవారం వార్షిక నివేదికను రిలీజ్ చేశారు. సాధారణ నేరాల్లో ప్రాపర్టీ అక్రమాలు మూడు శాతం, మహిళలపై నేరాలు ఒక్క శాతం, భౌతిక దాడులు రెండు శాతం పెరిగాయని తెలిపారు.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేదు
సైబరాబాద్‌లో మల్టీనేషనల్ కంపెనీలు, దేశవిదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సేఫ్టీ కోసం ‘సేఫ్ స్టే’ ప్రాజెక్ట్ ప్రారంభించామని తెలిపారు. హైటెక్ సిటీ పరిసరాల్లో దాదాపు 4 వేలకు పైగా హాస్టల్స్ ఉన్నాయని, ఇప్పటికే వెయ్యి హాస్టల్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేదన్నారు.
రూ.239.37 కోట్లు జరిమానాలు
గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్‌లోనే అత్యధిక ట్రాఫిక్ ఉందని సీపీ తెలిపారు. 36,20,487 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.239.37 కోట్ల జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గినా 850 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
న్యూ ఇయర్ ఈవెంట్స్ కు అనుమతి తప్పనిసరి
న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు అనుమతులు తప్పనిసరి అని, డ్రెంకన్ డ్రైవ్, పబ్బులపై ప్రత్యేక దృష్టి పెడతామని సీపీ చెప్పారు. పబ్బులు, ఫామ్‌హౌస్‌లపై పటిష్ట నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. గత ఏడాది గంజాయి, డ్రగ్స్ సప్లయ్ కి సంబంధించి 575 కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్టు చేశామన్నారు.
మొత్తం రూ.16.85 కోట్ల విలువ చేసే 1,508 కిలోల గంజాయి సహా వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో చార్జ్షీట్దాఖలు చేసినట్లు వెల్లడించారు.
