ఎడతెరిపిలేని వాన.. నీటి మునిగిన పంటపొలాలు తెగిన రోడ్లు

ఎడతెరిపిలేని వాన.. నీటి మునిగిన పంటపొలాలు తెగిన రోడ్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటి మునిగాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 8 సె.మీ. వర్షపాతం నమోదైంది.అత్యధికంగా  ఇల్లంతకుంటలో12 సె.మీ.,తంగళ్లపల్లి మండలంలో 9సె.మీ., వీర్నపల్లిలో 10 సె.మీ., రుద్రంగిలో 7సె.మీ.వర్షపాతం నమోదైంది. కోనరావుపేట మండలంలో 10 సె.మీ. వర్షం పడింది. మండలంలోని నిమ్మపల్లి మూలవాగు అలుగుదుంకి ఉధృతంగా ప్రవహిస్తోంది.మూలవాగుపై నిర్మించిన కాజ్ వేలు కొట్టుకుపోయాయి. మామిడిపల్లి మూలవాగు వంతెనపై రూ.11లక్షలతో ఇటీవల నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్ కొట్టుకుపోయింది.పెంటివాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగడంతో నిమ్మపల్లి, మరిమడ్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చేరడంతో పంట పొలాలు నీటి మునిగాయి. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట వద్ద బ్రిడ్జి మీది నుంచి నక్క వాగు పారుతోంది.  

మిడ్​ మానేరు నుంచి నీరు విడుదల

శ్రీరాంసాగర్ నుంచి మిడ్ మానేరుకు 11వేల క్యూసెక్కుల నీటిని  విడుదల చేశారు.  మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి 10వేల క్యూసెక్కుల నీటిని విడదల చేశారు. మిడ్ మానేరులో 27.5 టీఎంసీలకు గాను 20.28 టీఎంసీల నీరు నిల్వ ఉంది.గంబీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలకళను సంతరించుకుంది. వర్షా ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు. 

కోతకు గురైన పంట పొలాలు

వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట నక్కవాగు పారడంతో లింగంపల్లి, బొల్లారం, హన్మాజిపేట, మామిడిపల్లితో పాటు పలు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. బొల్లారంలో చెక్​డ్యాం పక్కన గల పంట పొలాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.  అధికారులు వాగు వద్ద గల ఇండ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  దాదాపు 32 మందిని జీపీ వద్దకు తరలించారు. చెక్​డ్యాం వద్ద  వాగు ఉధృతిని మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

వాగులో కొట్టుకుపోయిన గొర్రెలు 

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి వద్ద కోరెం వాగును గొర్రెలతో కాపరి దాటేందుకు ప్రయత్నించగా రెండు గొర్రెలు వాగులో కొట్టుకుపోయాయి.  పోలీసులు వాగు వద్దకు చేరుకుని జాగ్రత్తగా మిగతా గొర్రెలను వాగు దాటించారు.  మండలంలో రెండో రోజు భారీ వర్షం కురిసింది. వాగులు కల్వర్టుల పైనుంచి ఉధృతంగా ప్రవహించాయి.   సోమవారం సైతం వేములవాడ కు రాకపోకలు నిలిచిపోయాయి. స్థంభంపల్లి వద్ద గంజివాగు  దాటకుండ సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి ట్రాక్టర్ అడ్డుగా పెట్టారు.