
- 42 లక్షల మంది రైతుల రూ.1,580 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తది
హైదరాబాద్, వెలుగు: తాము రుణమాఫీకే పరిమితం కావడం లేదని, రైతు బీమానూ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. మొత్తం 42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,580 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేండ్లు గాలికి వదిలేసిన పంటబీమాను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రెండో విడత రుణమాఫీ తర్వాత ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు.
‘‘నేను, రేవంత్.. రాహుల్ గాంధీతో హెలికాప్టర్లో వెళ్తూ రూ.2 లక్షల రుణమాఫీపై చర్చించి వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించాం. అయితే, ఇది సాధ్యమా? అని ఆనాడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి అధికార పార్టీ మమ్మల్ని హేళన చేసింది. కానీ, మా ప్రభుత్వం సంకల్ప బలంతో చేస్తున్నది” అని భట్టి అన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఎంతగా తపిస్తున్నదో చెప్పడానికి రుణమాఫీ ఒక ఉదాహరణ అని భట్టి అన్నారు. రైతుల గుండెలపై ఉన్న పెద్ద భారం తొలగిపోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు చివరికల్లా రూ.2 లక్షల రుణ మాఫీ పూర్తి చేస్తామని వెల్లడించారు.
రుణమాఫీతో అన్ని రికార్డులే
రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు చెల్లించి రికార్డు సృష్టించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒకేసారి బ్యాంకులు ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లో వేయడం ఇదే మొదటిసారి అని, ఇదొక రికార్డు అని తెలి పారు. ‘‘ఒకేసారి 17 లక్షల రైతు కుటుంబాలు ప్రభుత్వం నుంచి లబ్ధిపొందడం కూడా మరో రికార్డు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో.. ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చు చేయలేదు. తెలంగాణ సర్కార్ చరిత్ర సృష్టించింది. మూడో విడత రుణమాఫీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి చాటుకుంటాం. రైతుల విషయంలో మా చిత్తశుద్ధిని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదు. ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణాల మాఫీ దేశ చరిత్రలోనే రికార్డు’’అని అన్నారు. రాష్ట్ర ప్రజల ముందు తమ సర్కార్ నిజా యతీ నిరూపించుకుందన్నారు.