పంటలకిచ్చే రుణం పెంచలే

పంటలకిచ్చే రుణం పెంచలే
  • ప్రధాన క్రాప్స్​కు గతేడాది మాదిరే ఖరారు
  • వరి, పత్తికి ఎకరాకు రూ.38 వేలు
  • కందికి రూ.18వేలు లోన్
  • పసుపు,టమోట, మిద్దెతోటలకుకొంత పెంపు
  • 2021-22కు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసిన టెస్కాబ్

హైదరాబాద్, వెలుగు:  ఏటా రైతులకు సాగు ఖర్చులు పెరుగుతుంటే.. సర్కారు మాత్రం పంట రుణ పరిమితి పెంచడం లేదు. ప్రతిసారి రూ.వెయ్యి, 2 వేలు పెంచితే, ఈసారి అది కూడా లేదు. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, పత్తి వంటి పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)కి సంబంధించి గతేడాది ఫిక్స్ చేసిన మొత్తాలనే ఈ సారి కూడా ఖరారు చేశారు. మరోవైపు సర్కారు ఫిక్స్ చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. ఖరారు చేసిన దాని కంటే రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు తగ్గించి ఇస్తున్నాయి.
ఆర్గానిక్​లో సాగు చేస్తే ఇలా..
ఆర్గానిక్‌‌‌‌ పద్ధతిలో పండించే కూరగాయలు, కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు వరకు ఖరారు చేశారు. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ. 40 వేలు ఇవ్వనున్నారు. దీంతో ఈసారి ఆర్గానిక్‌‌‌‌ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. టమాటకు ఈసారి రుణపరిమితి పెంచారు. సాగునీటి కింద వేసే టమాటాకు రూ.45 వేల నుంచి రూ.48 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. వంకాయ (విత్‌‌‌‌ మల్చింగ్‌‌‌‌కు) ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.45 వేలు రుణ పరిమితి ఖరారు చేశారు. ఇక మిద్దె తోటలకు మొదటి స్టేజ్​లో రూ.9,500 నుంచి రూ.10,500, రెండో స్టేజ్ లో రూ.19 వేల నుంచి రూ.21 వేలు, మూడో స్టేజ్​లో రూ.28,500 నుంచి రూ.31,500 ఇస్తారు. గతేడాది కంటే వెయ్యి రూపాయలు పెంచారు.
సాగు తక్కువ ఉన్న పంటకు పెంపు
రాష్ట్రంలో సాగు తక్కువ ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్​ ఫైనాన్స్​ను విపరీతంగా పెంచారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎకరాకు రూ.2.36 లక్షల మేర రుణ పరిమితి పెంచారు. గతేడాది దీనికి రూ.4.25 లక్షలు ఉండగా, ఈసారి రూ.6.61 లక్షలకు పెంచారు. మెడికల్, ఎరోమాటిక్‌‌‌‌ ప్లాంట్లకు రూ.2 వేల వరకు పెంచారు. రూ.37,500 వేల నుంచి రూ. 42,500 ఇస్తారు. పసుపు సాగుకు స్కేల్​ఆఫ్​ ఫైనాన్స్ పెరిగింది. ఈసారి రూ.70 వేల నుంచి రూ.75 వేలు ఇస్తారు. గతేడాది ఇది రూ.60 వేల నుంచి రూ.68 వేలుగా ఉంది. ఉల్లిగడ్డకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు, పుచ్చకాయకు రూ.27 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.
డెయిరీ, పౌల్ర్టీ, గొర్రెల యూనిట్లకూ..
పశుసంవర్ధక, ఫిషరీష్​ రంగంలో యూనిట్ల వారీగా రుణ పరిమితులు ఖరారు చేశారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసుకునేందుకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షలు ఇవ్వనున్నారు. పందుల పెంపకానికి యూనిట్​కు (3+1) రూ.43 వేలు..పౌల్ర్టీ ఫామ్ పెడితే బ్రాయిలర్​కు ఒక బర్డ్​కు రూ.150, లేయర్స్​కు రూ.310 ఇస్తారు. డెయిరీకి ఒక పాడి ఆవు లేదా బర్రె తీసుకునేందుకు రూ.21 వేలు నుంచి రూ.23 వేలు రుణం నిర్ణయించారు. హెక్టారు (రెండున్నర ఎకరాలు)లో చేపల పెంపకానికి రూ.4 లక్షల లోన్ ఇస్తారు.

ఏ పంటకు ఎంత?
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్‌‌‌‌) వివిధ పంటలకు 2021–22కు గాను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించింది. వరి, కంది, శన గ, పెసర, మినుము, ఆయిల్‌‌‌‌ పామ్, టమాట, వంకాయ పంటలతో పాటు డెయిరీ, పౌల్ర్టీ వంటి వాటికి రుణ పరిమితి నిర్ధారించింది. రాష్ట్రంలో సాగయ్యే వరికి ఎకరాకు రూ.34 వేల నుంచి రూ.38 వేలు ఖరారు చేసింది. శ్రీవరికి రూ.36 వేలు, వరి విత్తనోత్పత్తికి రూ.45 వేలు ఇవ్వాలంది. పోయినేడు ఇంతే మొత్తం రుణ పరిమితి ఉంది. పత్తి పంటకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.38 వేలు, పత్తి విత్తనోత్పత్తికి రూ.1.40 లక్షలు ఫిక్స్​ చేశారు. కందికి ఎకరాకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు, వర్షాధారమైతే గరిష్టంగా రూ.18 వేల రుణ పరిమితి పెట్టింది. కంది విత్తనోత్పత్తికి రూ.22 వేల నుంచి రూ.27 వేలు చేశారు. సోయాబీన్‌‌‌‌కు రూ. 22 వేల నుంచి రూ.24 వేలు ఇస్తారు. మొక్కజొన్నకు రూ.25 వేల నుంచి రూ.28 వేలు, వర్షాధార పంట కింద సాగు చేస్తే ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.24 వేలు  ఇవ్వాలని పేర్కొంది. చెరకు ప్లాంటేషన్​కు రూ.70 వేల నుంచి రూ.75 వేలు.. సోయా విత్తనోత్పత్తికి రూ.28 వేల నుంచి రూ.31 వేల వరకు ఇస్తారు.