సంగారెడ్డి జిల్లాలో క్రాప్​ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి జిల్లాలో క్రాప్​ లోన్లు ఇస్తలేరు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఇన్ ​టైంలో కంప్లీట్​ చేయాలని బ్యాంకర్ల మీటింగ్​లో జిల్లా యంత్రాంగం చెబుతున్నా బ్యాంకు ఆఫీసర్ల తీరు మాత్రం మారడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాత అప్పులను రెన్యూవల్​ చేస్తుండడంతో కొత్తగా అప్పులు ఇవ్వడం లేదు. 

ఆగస్టులోనే కంప్లీట్​కావాలి.. కానీ.. 

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మొత్తం 22 ఉన్నాయి. వాటికి ఉన్న 219 బ్రాంచీల ద్వారా ఈ ఏడాది వానాకాలం సీజన్ లో రూ.1,478 కోట్ల రుణ లక్ష్యం నిర్ధారించారు. ఇందులో రూ.1,144 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. ఆగస్టులోగా పూర్తి చేయాల్సిన రుణ లక్ష్యం అక్టోబర్ దాటుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. 

ఇదీ.. బ్యాంకుల తీరు!

బ్యాంక్ ఆఫ్ బరోడాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాంచీల ద్వారా వానాకాలం సీజన్ లో రూ.37 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా, రూ 92 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్ రూ.61 కోట్ల పంట రుణాల లక్ష్యం నిర్దేశించగా, రూ.8.45 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేకపోయింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకర్లు సీజన్ కు తగ్గట్టుగా రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

ప్రతి సీజన్​లో ఇదే సమస్య.. 

జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించే బ్యాంకర్ల మీటింగ్ లో వ్యవసాయ రుణాలపై దిశా నిర్దేశం చేస్తారు. నిర్ణయించిన లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నారో ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు. 

టార్గెట్​​ పూర్తి చేసేందుకు కార్యాచరణ ఉంటుంది. కానీ నిర్దేశించిన లక్ష్యం దాదాపు ఏ సీజన్ లోనూ పూర్తి చేయడం లేదు. కలెక్టర్, లీడ్ బ్యాంక్ అధికారులు సంబంధిత బ్యాంకర్లను  హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.