
- టార్గెట్ రూ.52,290 కోట్లలో 30 శాతం అప్పులిచ్చిన బ్యాంకర్లు
- రుణాలతో రైతుల్లో కొత్త జోష్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌లో రైతులకు పంట రుణాలు దండిగా అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.52,290 కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకూ రూ.15,932.96 కోట్ల రుణాలను (30 శాతం) బ్యాంకులు 9,68,792 మంది రైతులకు అందజేశాయి. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో రుణాలు అందడం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. 2018 డిసెంబర్ 11 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది.
దీంతో 25 లక్షల మంది రైతులకు రూ.21,000 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. గత బీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ సరిగా అమలు చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, కొత్త ప్రభుత్వం స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశాలు నిర్వహించి, లక్ష్యాలు నిర్దేశించడంతో బ్యాంకర్లు రుణాల జారీకి ముందుకొచ్చారు. రుణమాఫీ నిధులు బ్యాంకులకు సకాలంలో చేరడంతో రైతులకు విరివిగా కొత్త రుణాలు అందుతున్నాయి.
గత ఏడాది రికార్డు స్థాయిలో రుణాలు
2024–-25 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం సీజన్‌లో రూ.54,480 కోట్ల లక్ష్యం పెట్టుకోగా.. 33,38,609 మంది రైతులకు రూ.44,438 కోట్ల రుణాలు (81.57 శాతం) అందాయి. అలాగే, యాసంగి సీజన్‌లో రూ.36,315.19 కోట్ల లక్ష్యం పెట్టుకోగా 14,50,380 మంది రైతులకు రూ.28,666.74 కోట్ల రుణాలు (78.94 శాతం) అందించారు. మొత్తంగా గత ఏడాది రెండు సీజన్‌లలో రూ.90,785.19 కోట్ల లక్ష్యంలో 47,88,989 మంది రైతులకు రూ.73,104.74 కోట్ల రుణాలు అందాయి.
ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో రైతులకు పంట రుణాలు అందిన ఘనతను సాధించింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.9 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. అంతేకాకుండా మరో 1.32 లక్షల మందికి రైతులకూ లోన్లు అందాయి.