పోలవరం బ్యాక్ వాటర్‌‌తో పంట నష్టం.. చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు

పోలవరం బ్యాక్ వాటర్‌‌తో పంట నష్టం.. చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు

పోలవరం ఎత్తు పెంచడం వల్ల లక్ష ఎకరాలు మునిగిపోతాయని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు. దీంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని, భద్రాచలం, పర్ణశాలలు మునిగిపోతాయని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల కలిగే నష్టం, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినా.. ఇప్పటికి స్పందించలేదని వాపోయారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనే విషయంలో అధికారులు సంసిద్ధంగా లేరని కొందరు  విమర్శలు చేయడం సరికాదని రజత్ కుమార్ అన్నారు. పంప్ హౌజ్ మరమ్మత్తులకు రూ.300 కోట్లు ఖర్చువుతుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, రిపేర్ కు రూ.20కోట్లకు మించి కాదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ కట్టిన వాళ్లే ఈ ఖర్చును భరిస్తారని స్పష్టం చేశారు. సెప్టెంబర్ లోపు మళ్లీ పంప్ హౌజ్ లు నడుస్తాయని, ప్రస్తుతం పవర్ రిస్టోర్ అయ్యిందని రజత్ కుమార్ చెప్పారు. 

18 కేంద్ర సంస్థలు అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని రజత్ కుమార్ స్పష్టం చేశారు. 100 ఏండ్ల తరువాత ఇంత భారీ వర్షాలు కురిశాయన్న ఆయన.. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మత్తులు చేసినందునే ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాలు, కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడిందన్నారు. కడెం, కాళేశ్వరం వద్ద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారణ చేస్తోందని వెల్లడించారు. IMD డేటా, యూరో శాటిలైట్తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలిపారు. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు జరిగిందని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు.