ప్రాజెక్టుల కింద ఎండిపోతున్న పంటలు

ప్రాజెక్టుల కింద ఎండిపోతున్న పంటలు
  • వేల ఎకరాల్లో చివరి ఆయకట్టుకు నీళ్లందుతలే
  • సగంలోనే ఆగిన చిన్న రిజర్వాయర్ల పనులు
  • కాల్వలకు ఏండ్లుగా లైనింగ్‌, రిపేర్లు లేవు
  • నీళ్లు లేక కోతకొచ్చిన పంటను ఇడిసిపెడ్తున్న రైతులు

కరెక్టు టైమ్‌‌కు నీళ్లందక రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు ఆగమైతున్నయ్‌‌. ఆయకట్టు చివరి భూముల దాక నీళ్లు రాక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నయ్‌‌. కొత్త కాల్వలు తవ్వక, పాతవి రిపేర్లు చేయక, ఫీడర్‌‌ ఛానళ్లు రెడీ కాక రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద కూడా పూరా ఆయకట్టుకు పోతలేవు. దీంతో పెద్ద ప్రాజెక్టుల్లో ఫుల్లు నీళ్లున్నయని పంటలేసిన రైతులు ఇప్పుడు అరిగోస పడుతున్నరు. నీళ్లు లేక కోతకొచ్చిన పంటలను ఇడిసిపెడ్తున్నరు. ఎడ్లు, గొర్లను తోలుతున్నరు. 

సర్కారు మాటలు నమ్మి..

గతేడాది వివిధ ప్రాజెక్టుల కింద కొత్తగా 25.10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని సర్కారు చెప్పింది. కానీ 1.48 లక్షల ఎకరాలకే ఇచ్చింది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ ప్రపోజల్స్‌‌లో సర్కారే ఈ విషయం వెల్లడించింది. ప్రాజెక్టులు, కెనాల్స్ పూర్తవుతాయని, ఆయకట్టు చివరి భూములకూ నీళ్లొస్తాయని, చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయనుకొని రైతులు భారీ స్థాయిలో పంటలు సాగు చేశారు. గతేడాది వర్షాలు బాగా కురవడం, ప్రాజెక్టులన్నీ నిండటంతో ఈ యాసంగిలో సాధారణ సాగు (36.43 లక్షల ఎకరాల)ను మించి సుమారు 64 లక్షల ఎకరాల్లో రకరకాల పంటలేశారు. ఖరీఫ్‌‌ను మించి 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ప్రధాన ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రిజర్వాయర్లు, కెనాల్స్​ పూర్తికాకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఏ ప్రాజెక్టు కింద కూడా చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందట్లేదు. పైగా భూగర్భజలాలు కూడా పడిపోతుండటంతో బావులు, బోర్ల కింద పంటలు కూడా ఎండిపోతున్నాయి. దీంతో  రైతులు పుట్టెడు దుక్కంతో పోలాలను విడిచిపెట్టి ఎడ్లు, గొర్లను మేపుతున్నారు. 

‘మోతె’ మొదలు కాలె.. ‘కలికోట’ పనులు కాలె 

కరీంనగర్ జిల్లాలో రూ.240 కోట్లతో చేపట్టిన మోతె ప్రాజెక్టు పనులు మొదలుకాలేదు. దీంతో రామడుగు మండలంలోని రామడుగు, షానగర్, కొరటపల్లి, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్ గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ఓవైపు లక్ష్మీపూర్ పంప్‌‌హౌస్‌‌.. మరోవైపు వరద కాలువ ఉన్నా ఈ గ్రామాల్లో పొలాలు ఎండుతున్నాయి. జగిత్యాల జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 2 కింద కథలపూర్ మండలం కలికోటలో రిజర్వాయర్‌‌కు రూ. 204 కోట్లతో శంకుస్థాపన చేశారు. కానీ పనులు కాకపోవడం వల్ల 43,100 ఎకరాలకు నీళ్లు అందట్లేదు. కొడిమ్యాల మండలం పోతారం నుండి జేఎన్‌‌టీయూ వరకు 7 కిలోమీటర్ల కెనాల్ పనులు ఆగి 2 వేల ఎకరాలు ఎండిపోతున్నాయి.
 
రామగుండం లిఫ్టు అయిపోదాయె 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.1,468 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు మెల్లగా సాగుతున్నాయి. 3 టీఎంసీల మల్కపేట రిజర్వాయర్ పనులు 9 ఏళ్లుగా పూర్తి కావట్లేదు. కట్ట పనులతో పాటు 10 కిలోమీటర్ల లైనింగ్, సొరంగం పనులు పెండింగ్ పడ్డాయి. 80 వేల ఎకరాల్లో పంటల పరిస్థితి అధ్వానంగా మారింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు అంతర్గాం మండలంలోని మూర్ మూర్ వద్ద రూ.100 కోట్లతో  చేపట్టిన రామగుండం లిఫ్టు స్కీం పనులు మూడేండ్లుగా పూర్తి కావట్లేదు. సిరిసిల్ల జిల్లాలోని రంగనాయక ప్రాజెక్టు నుంచి కాల్వలు తవ్వక తంగళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో వరి ఎండుతోంది. ఎల్లంపల్లి కాలువ ద్వారా చందుర్తి మండలానికి నీళ్లు వచ్చినా అనంతపల్లి ఊర చెరువును నింపకపోవడంతో నర్సింగాపూర్, మూడపల్లి,అనంతపల్లిలో పంటలు ఎండుతున్నాయి.

ఆదిలాబాద్‌‌లో కాల్వలన్నీ ఖరాబ్‌‌

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనాక కొరటా పనులు 60 శాతమే జరిగాయి. దీంతో13,500 ఎకరాలకు నీళ్లు రావట్లేదు. సాథనాలా ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా కెనాల్స్‌‌కు లైనింగ్ లేక 16 వేల ఎకరాలకే నీళ్లు అందుతున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టు ద్వారా 8,500 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. కానీ 3 కిలోమీటర్ల మేర కెనాల్స్‌‌కు లైనింగ్ లేక 4 వేల ఎకరాలే పారుతోంది. నిర్మల్‌‌ జిల్లాలో రూ. 520 కోట్లతో 2016లో చేపట్టిన సదర్మట్‌‌ ప్రాజెక్టు పనులు 60 శాతమే పూర్తయ్యాయి. దీంతో జిల్లాలో 11 వేల ఎకరాలకు నీరు అందట్లేదు. ఇదే జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు, ఎస్సారెస్పీ సరస్వతి కాల్వల లైనింగ్​దెబ్బతింది. పూడిక కూడా తీయక 15 వేల ఎకరాలకు నీరు అందట్లేదు. ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు 20 ఏండ్లుగా రిపేర్లు చేస్తలేరు. దీని కింద 24,500 ఎకరాల ఆయకట్టుంది. మెయిన్ కెనాల్, ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతిని 7 వేల ఎకరాలకే నీరందుతోంది. రూ. 246.49 కోట్లతో కడుతున్న జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు పనులు 40 శాతమే కావడంతో కాగజ్ నగర్, దహెగాం మండలాల్లోని 15 వేల ఎకరాల్లో పొలాలు ఎండుతున్నాయి.
 
వరంగల్‌‌లో కట్టలు, రిజర్వాయర్లు సగం సగమే 

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి పెద్ద చెరువు కట్ట నిర్మాణానికి రూ.23.50 కోట్లు శాంక్షన్‌‌ అయ్యాయి. కానీ పనులు కాక 1,500 ఎకరాల ఆయకట్టుకు నీరందట్లేదు. జనగామ జిల్లాలో రూ. 324 కోట్లతో కడుతున్న చెన్నూరు, పాలకుర్తి, ఉప్పుగల్లు రిజర్వాయర్ల పనులు 22 శాతమే పూర్తయ్యాయి. దీంతో 77,890 ఎకరాల ఆయకట్టుకు నీరందట్లేదు. వీటి పరిధిలో వేలాది ఎకరాలు ఎండుతున్నాయి.
 
‘శనిగరం’ పూడిక తీయరు.. 

మెదక్ జిల్లాలో రూ. 43.64 కోట్లతో చేపట్టిన వనదుర్గా ప్రాజెక్టు (ఘనపూర్) ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పెండింగ్ పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహబూబ్ నహర్ కాలువ 10 కిలోమీటర్లు, ఫతే నహర్ కాలువ 27 కిలోమీటర్ల వరకు లైనింగ్ పూర్తి కాక 5 వేల ఎకరాలకు నీరందట్లేదు. సంగారెడ్డి జిల్లా నారింజ ప్రాజెక్టులో పూడికతీత కోసం రూ. 5.50 కోట్లు శాంక్షన్‌‌ చేసి ఏడాదైనా పనులు పూర్తి కాలేదు. 8 వేల ఎకరాల్లో పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట జిల్లా లోని మల్లన్న సాగర్‌‌‌‌, గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తికాక దాదాపు 2.50 లక్షల ఎకరాలకు నీరు అందట్లేదు. రంగనాయక సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌ డిస్ట్రిబ్యూటరీ చానల్స్, కొండపోచమ్మ సాగర్‌‌‌‌నుంచి 4 మెయిన్ కెనాల్స్ పూర్తికాక లక్ష ఎకరాలకు పైగా నీరు అందట్లేదు. శనిగరం ప్రాజెక్టు రెండు కాల్వల్లో పూడిక తీయక రెండు వేల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

మంచిప్ప రిజర్వాయర్‌‌ మధ్యలనే ఆగె 

నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం 21 ప్యాకేజీ పనులు 40 శాతం పెండింగ్‌‌లో ఉన్నాయి. మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల కెపాసిటీతో కడ్తున్న రిజర్వాయర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీరందట్లేదు. అలీసాగర్ చివరి ఆయకట్టు గ్రామాలు బోర్గాం (కె), మాక్లూర్, మాదాపూర్, ముల్లంగి, బొంకంపల్లి గ్రామాల్లోని 5,342 ఎకరాలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో  కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులు స్లోగా నడుస్తున్నాయి. ఈ ప్యాకేజీ ద్వారా 2 లక్షల 10 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నా ఫండ్స్ లేక మెయిన్ కెనాల్స్ ఆగిపోయి ఒక్క ఎకరా కూడా పారట్లేదు. పోచారం ప్రాజెక్టు కింద మెయిన్ కెనాల్స్‌‌కు లైనింగ్ లేక30 వేల ఆయకట్టులో సగానికి నీరు పోవట్లేదు.

4 లక్షలంటిరి.. 2 లక్షల ఎకరాలకు కూడా పారట్లె

మహబూబ్‌‌నగర్, నాగర్‌‌ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో 500 చెరువులను కల్వకుర్తి లిఫ్టు ద్వారా నింపి 4 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. కానీ కెనాల్స్‌‌కు లైనింగ్ చేయకపోవడం, ఫీడర్​చానల్స్ లేకపోవడంతో 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందడం లేదని రైతులు, రైతుసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లాలో భీమా,కల్వకుర్తి లిఫ్టు స్కీంల కెనాల్స్‌‌కు లైనింగ్ లేకపోవడంతో తరుచూ తెగుతున్నాయి. దీంతో 10 వేల ఎకరాలకు నీళ్లు సరిగా రావట్లేదు. మదనాపురం మండలంలో 2006లో నెల్విడి లిఫ్టు స్కీం కోసం రూ.15 కోట్లు ఖర్చుపెట్టినా పూర్తికాకపోవడంతో నీళ్లు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద స్టేజ్ 1, స్టేజ్ 2 పరిధిలో 160 కిలోమీటర్ల మెయిన్ కెనాల్‌‌కు లైనింగ్ చేయలేదు. దీంతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకే అందుతోంది. 

‘నృసింహా’ అయిపోదాయె.. బోర్లే దిక్కాయె

యాదాద్రి జిల్లాలో నృసింహ రిజర్వాయర్ పూర్తయితే1.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. ఇప్పటివరకు 50 శాతం నిర్మాణం పూర్తికావడంతో రైతులకు బోర్లే దిక్కయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు కెనాల్స్ ఆధునీకరణ కోసం 2017లో రూ. 65 కోట్లు విడుదల చేసినా 25 శాతం పనులు పూర్తి కాలేదు. దీంతో 30 వేల ఆయకట్టు ఉన్న మూసీ కింద 18 వేల ఎకరాలకే సాగు నీరందుతోంది.
 
ఖమ్మంలో ఎండిన వరి దుబ్బలతో నిరసన

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు అందట్లేదు. దీంతో  వెంకటగిరి, గాంధీ నగర్ తండా, కలకొడిమ, బస్వాపురం గ్రామాల్లో వరి చేన్లు ఎండుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. బిల్లుపాడు గాంధీ నగర్ తండా రైతులు ఇటీవల ఎన్‌‌ఎస్‌‌పీ ఆఫీసు ముందు ఎండిపోయిన వరిదుబ్బులతో ఆందోళన చేశారు.