6 లక్షల ఎకరాల్లో పంటలు ఆగం

6 లక్షల ఎకరాల్లో పంటలు ఆగం
  • తెంపులేని వానలతో రైతులకు తీరని నష్టం
  • నీటమునిగి, జాలు పట్టి ఖరాబైతున్న చేన్లు
  • పట్టించుకోని రాష్ట్ర సర్కారు     ఆర్డర్స్ లేవని అంచనా వేయని వ్యవసాయశాఖ
  • ఆరేండ్లుగా పంట నష్టాలకు పైసా ఇవ్వని సర్కార్​
  • నీటమునిగి, జాలు పట్టి ఖరాబైతున్న చేన్లు
  • ఆర్డర్స్ లేవని అంచనా  వేయని వ్యవసాయశాఖ
  • ఆరేండ్లుగా పంట నష్టాలకు పైసా ఇయ్యని సర్కార్


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో తెంపులేకుండా కురుస్తున్న వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కుండపోత వానలతో వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాలకు పైగా పంటలపై ఎఫెక్ట్ పడింది. పత్తి, వరి, మొక్కజొన్న, సోయా, పసుపుతో పాటు పునాస పంటలు ఖరాబైనయ్. పత్తి, మక్క చేన్లు నేలకొరగాయి.. వరి నీటమునిగింది. వానల దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీరని నష్టం జరిగితే సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. సర్కార్ ఆర్డర్స్ లేవని వ్యవసాయ శాఖ జరిగిన నష్టాన్ని అంచనా వేయట్లేదు. ఆరేండ్లుగా ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న రైతుల విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది.
రైతుకు కన్నీళ్లే
వారం రోజులుగా కురుస్తున్న భారీ వానలకు 60 వేల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. 20 వేల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత నెలలో పడ్డ వానలకు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. రైతులకు ఇంత నష్టపోయినా సర్కారు కనీసం పట్టించుకోవడం లేదు. సర్కార్​ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ వ్యవసాయశాఖ పంట నష్టంపై అంచనాలు వేయడం లేదు. నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌ వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మబ్బుల దాకా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఒర్రెలు తెగడం, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. గత నెల రోజులగా తెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వానతలో పొలాలు జాలు పట్టి చేన్లు ఎర్రబారి పోయాయి. వేరుకుళ్లు రోగం పెరిగి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అమలు కాని హుడా కమిటీ సిఫారసులు
2015 నుంచి పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంట నష్టం సైతం అంచనా వేయడం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని పరిహారం అడగడంలో కూడా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రకృతి వైపరిత్యాలతో ఏటా రైతులు నష్టపోయినా కేంద్రానికి రిపోర్టు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. కనీసం వ్యవసాయశాఖతో పంట నష్టం ప్రాథమిక అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలే. కానీ ఆరేండ్లుగా రాష్ట్ర సర్కార్ ఏనాడు ఆ ప్రయత్నం చేయలేదు. ప్రకృతి వైపరిత్యాలతో పంటలకు నష్టం జరిగితే మెట్టపంటలకు రూ.25 వేలు, తరికి రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని హుడా కమిషన్‌‌ సిఫారసు చేసింది. కానీ పంట నష్టపోయిన రైతులకు సర్కార్‌‌ పైసా కూడా సాయం చేయడం లేదు. దీనికి తోడు పంట బీమా లేకపోవడంతో రైతులు నిండా మునిగే పరిస్థితి నెలకొంది.