
మంచి లాభాలు పొందుతున్న నస్కల్ రైతులు
భూమి, నీళ్లు, టైం, పెట్టుబడి అన్నీ తక్కువే
ఏటా యాసంగిలో పంట.. 45 రోజుల్లో చేతికి
ఎకరాకు రూ.3.5 లక్షల వరకు ఆదాయం
గతేడాది ఊరోళ్లకు రూ. కోటికిపైగా సంపాదన
30 రోజుల్లో ₹16.70 లక్షల ఆదాయం
మూడేళ్ల క్రితం ఊర్లో కొత్తిమీర వేయడం మొదలుపెట్టాం. మా మూడు కుటుంబాలు కలిసి ఆరున్నర ఎకరాల్లో వేశాం. రూ. 1.5 లక్షల నుంచి రూ. 3.75 లక్షల వరకు ధర పలికింది. ఆరున్నర ఎకరాలకు 28 నుంచి 30 రోజుల్లో రూ.16.70 లక్షల ఆదాయం వచ్చింది. మమ్మల్ని చూసి చుట్టుపక్కల గ్రామాల్లో పండిస్తున్నారు. – లక్ష్మీకాంత్‌రెడ్డి, యువరైతు, నస్కల్
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా రైతులు కొత్త ఉరవడి సృష్టిస్తున్నరు. కొత్తిమీర కట్టతో రూ. కోట్లు సంపాదిస్తున్నరు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడి, తక్కువ నీళ్లు పెట్టి ఎక్కువ లాభాలు పొందుతున్నరు.
ఒక్క పంటతో రూ.కోటికి పైగా
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్‌లో దాదాపు 30 మంది రైతులు ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొత్తిమీర పండిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి 8 ఎకరాల్లో పంట వేస్తున్నరు. ఆ ఒక్క పంటతోనే అందరూ కలిసి రూ.కోటికి పైగా డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో ఆ ఊర్లోని ముగ్గురు అన్నదమ్ములు ఒక్కొక్కరు ఐదెకరాల్లో కొత్తమీర వేసి 45 రోజుల్లో రూ.45 లక్షల సంపాదించారు. రైతు రవి తన మూడెకరాల్లో పంటేస్తే ఎకరాకు రూ.3.75 లక్షలు గిట్టుబాటైంది.
నస్కల్‌ను చూసి పక్క ఊర్లల్లో..
నస్కల్‌లో కొత్తిమీరతో రైతులకు మస్తు ఆదాయం వస్తుండటం చూసిన పక్క ఊర్ల రైతులు ఆ పంట పండించడం స్టా్ర్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని ఆలూరు, చేవెళ్ల, బర్కత్‌పల్లి, గొట్టిముక్కుల, దాచారం, రుక్కుంపల్లి, కంకల్, తిరుగాయపల్లి, మేడిపల్లి, పరిగిల్లోనూ కొత్తిమీర ఎక్కువగా సాగవుతోంది. హైదరాబాద్, శంషాబాద్, షాద్‌నగర్ వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొత్తిమీర కొని కూలీలతో కట్టలు కట్టించుకుని పట్టణాలకు తరలిస్తున్నారు. యాసంగిలో తక్కువ టైంలో ఎక్కువ గిట్టుబాటవుతోందని, నీళ్లుంటే చాలు తక్కువ భూమున్నా పెద్దగా పెట్టుబడి లేకుండా మంచి ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.
నెలలో చేతికొస్తది
కొత్తిమీర విత్తనాల ధర కిలో రూ.70 నుంచి రూ.100 వరకు ఉంది. ఎకరాకు 50 కిలోల విత్తనాలు, రెండు బస్తాల డీఏపీ ఎరువు చాలు. డ్రిప్‌కు పైపులతో కలిపి ఎకరాకు రూ.6 వేలు ఖర్చవుతుంది. మూడేళ్ల వరకు పని చేస్తుంది. 35 నుంచి 45 రోజుల్లో కొత్తిమీర పంట వచ్చేస్తది. పంట తీసినా అదే చేనులో రెండో పంట వేసుకోవచ్చు. పెండ్లిళ్ల సీజన్‌లో కొత్తిమీరకు మంచి గిరాకీ ఉంటుందని రైతులు చెబుతున్నారు. కోతులు, ఇతర జంతువులు పంట జోలికి పోవంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పంట వేయడానికి అనువని సైంటిస్టులు సూచిస్తున్నారు.
లక్షకు తక్కువ రాలె
3, 4 ఎకరాల్లో కొత్తిమీర వేస్తున్నా. గత సీజన్‌లో ఎకరానికి రూ.3.75 లక్షలు పలికింది. మక్కలు, పత్తి కంటే కొత్తిమీరే బెటర్. ఎప్పుడేసినా ఏప్రిల్, మే నెలల్లో ఎకరాకు రూ. లక్షకు తక్కువ రాలె.- రవి, రైతు, నస్కల్
ఈజీగా నెలకు రూ. లక్ష
ఐదారేళ్లుగా కొత్తిమీర వేస్తున్న. పెద్దగ ఖర్చేం లేకుండానే పంట చేతికొస్తోంది. నెల రోజుల్లోనే ఈజీగా రూ. లక్ష సంపాదించొచ్చు. వ్యాపారులే మాదగ్గరకొచ్చి కొనుక్కుపోతున్నారు. పాత పద్ధతిలోనే సాగు చేస్తున్నా మంచి ఫలితాలొస్తున్నాయి. వాము కూడా వేస్తున్నా.-అంజయ్య, రైతు, నస్కల్