పొరపాటున కొంతమంది ఖాతాల్లోకి కోట్ల రూపాయలు

పొరపాటున కొంతమంది ఖాతాల్లోకి  కోట్ల రూపాయలు

రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు. ఏకంగా కోటి రూపాయలు అకౌంట్లో పడితే ఎట్లుంటుంది. ఒక్కసారిగా మనకే షాక్. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.. ఎవరు వేశారో కూడా తెలియదు. కానీ అనుకోకుండా అదృష్టం తలుపుతట్టినట్లు.. లక్షల రూపాయలు అకౌంట్ లో జమ అయినట్లు మెస్సేజ్ వస్తే ఆ థ్రిల్లే వేరు. పక్కోళ్లకు చెప్పలేము. అలా అని డబ్బులు డ్రా చేయకుండా ఉండలేము. సేమ్ ఇదే సీన్ ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. ఈ బ్యాంకులో అకౌంట్లు ఉన్న ముగ్గురు రైతుల కిసాన్ ఖాతాల్లో కోటి 28 లక్షలు జమ అయ్యాయి. జమ అయిన డబ్బులో నుంచి దాదాపు 16 లక్షలు ఖర్చు చేసుకున్నారు రైతులు. ఈ ముగ్గురిలో ఓ రైతు ఇల్లు కట్టుకుంటే.. మరో రైతు అప్పు తీర్చుకున్నాడు. ఇంకో రైతు ఇతర అవసరాలకు వాడుకున్నాడు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా డబ్బులు వచ్చాయనుకొని.. డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు రైతులు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ తోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు చెబుతున్నారు బ్యాంకు అధికారులు. నగదు ఖర్చు అవడంతో ఇప్పుడు ఎలా కట్టాలని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ ముగ్గురు రైతులే కాదు ఊరిలో చాలామంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు చెబుతున్నారు. అయితే ఓ రైతు తన అకౌంట్లో 60కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించిందని.. అందులో ఐదున్నర లక్షలతో ఇల్లు కట్టుకున్నట్లు చెప్పాడు.