భూపాలపల్లి జిల్లాలో కోట్లలో ఇసుక కుంభకోణం

భూపాలపల్లి జిల్లాలో కోట్లలో ఇసుక కుంభకోణం
  • భూపాలపల్లి జిల్లాలో కోట్లలో కుంభకోణం
  • నకిలీ వే బిల్లులతో సర్కారు ఖజానాకు గండి
  • టీఎస్‌‌ఎండీసీ సిబ్బంది, ఇసుక కాంట్రాక్టర్ల పాత్ర
  • ఏడుగురిపై కేసు.. ఇద్దరు అరెస్టు‌

గత ఏప్రిల్‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా 44 ఇసుక క్వారీలు నడిపించారు. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 24 క్వారీలు నడిచాయి. ఈ నెలలో 61,608 లారీల నంబర్లతో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫీజు చెల్లించి 10,32,653 క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక బుక్‌‌‌‌ చేసుకున్నారు. ప్రభుత్వానికి రూ.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి రూ.720 కోట్ల ఆదాయం వచ్చినట్టు. అంటే రెండేళ్లలో రెండున్నర కోట్ల క్యూబిక్‌‌ మీటర్ల ఇసుక రవాణా జరిగితే రూ.1,500 కోట్లకు మించి ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. కానీ గత రెండేళ్లలో ఒక్క భూపాలపల్లి జిల్లాలోని క్వారీల నుంచి 3.5 కోట్ల క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక మాయమైంది. అంటే కోటి క్యూబిక్‌‌ మీటర్ల ఇసుక లెక్కలోకి రాలేదు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.600 కోట్ల ఆదాయం దారిమళ్లింది.

ఇదీ జరుగుతున్నది..

భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం తరఫున ఇసుక క్వారీ నిర్వహించే ఓ కాంట్రాక్టర్‌‌‌‌కు, అతడి సమీప బంధువులకు 20 లారీలున్నాయి. రాత్రవగానే ఆ లారీలు క్వారీకొస్తాయి. టీఎస్‌‌ఎండీసీ సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌ కూడా ఏమీ అనరు. వే బిల్లులు లేకుండానే ఒక్కో దాంట్లో రూ.12 వేల విలువ చేసే 20 క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక నింపేస్తారు. ఆ లారీలు హైదరాబాద్‌‌‌‌ వెళ్లి ఇసుక అన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసి మళ్లీ క్వారీ వద్దకు చేరతాయి. ఇలా నెలలో 600 ట్రిప్పులు. ఈ ఒక్క స్టాక్‌‌‌‌ పాయింట్‌‌ నుంచే.. ఒక వ్యక్తికి చెందిన లారీల వల్లే రూ.72 లక్షల నష్టమన్నమాట.

పెద్దపెద్దోళ్లే ఉన్నారు..

రాష్ట్రంలో వివిధ పార్టీల నాయకులు, పోలీస్‌‌ అధికారులు ఇసుక వ్యాపారంలో ఉన్నారు. సొంతంగా, బినామీల పేర లారీలు కొని ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. చాలా మంది నకిలీ వే బిల్లులు సృష్టించి మాయ చేస్తున్నారు. వీరికి టీఎస్‌‌‌‌ఎండీసీ అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల  భూపాలపల్లి జిల్లాలో నకిలీ వే బిల్లులతో పట్టుబడిన 4 లారీల వ్యవహారంపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుగొలిపే తెలుస్తున్నాయి. నకిలీ వే బిల్లులతో ఇసుక కుంభకోణం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

క్వారీలు ఎక్కడెక్కడ?

రాష్ట్రంలో 358 ఇసుక క్వారీలున్నాయి. వీటిలో ప్రస్తుతం 32 నడుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 22 క్వారీలు నడుస్తుండగా నల్గొండ ఒకటి, కొత్తగూడెం 4, మంచిర్యాల 2, పెద్దపల్లి 3 చొప్పున పనిచేస్తున్నాయి. అన్నీ గోదావరి తీర ప్రాంత క్వారీలే. వీటిని తెలంగాణ రాష్ట్ర మినరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌ ‌‌(టీఎస్‌‌ఎండీసీ) నిర్వహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల  భూపాలపల్లి జిల్లాలో 5 కోట్లకు మించి క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక నదిలో మునిగిపోతుందని భావించిన సర్కారు దాన్ని అమ్మి రూ.3,000 కోట్లకు పైగా ఆదాయం పొందాలని భావించింది. రెండేళ్లుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చి భారీగా అమ్మకాలు జరుపుతోంది.

క్యూబిక్‌‌ మీటర్‌‌‌‌కు రూ.600

ఇసుక కావాల్సిన వారు క్యూబిక్‌‌ మీటర్‌‌‌‌కు జీఎస్టీ కాక రూ.600 చొప్పున ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చెల్లించి వే బిల్లు పొందాలి. దాన్ని క్వారీ వద్ద టీఎస్‌‌‌‌ఎండీసీ సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌కు చూపిస్తే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చెక్‌ చేసి ఇసుక నింపుతారు. 14 టైర్ల లారీలో 20 క్యుబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక నింపుతారు. దీనికి ప్రభుత్వానికి రూ.12 వేలు చెల్లించాలి. జీఎస్టీ అదనం. ఇదే లారీ ఇసుకను వ్యాపారులు హైదరాబాద్‌‌‌‌లో రూ.70 వేల నుంచి రూ.80 వేలకు అమ్ముకుంటారు. ఒకే రోజు సుమారు 2 వేలకుపైగా లారీలు ఇక్కడ ఇసుక నింపుకుని వెళ్తుంటాయి.

నకిలీ వే బిల్లుల వ్యవహారం బయటపడిందిలా

కొందరు ఆన్‌‌లైన్‌‌లో ఫీజు చెల్లించకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ఇసుక తీసుకెళ్తున్న విషయం పోలీసుల దృష్టికొచ్చింది. ఏప్రిల్‌‌‌‌ 29న మణికాంత్‌‌ అనే వ్యక్తికి చెందిన 4 ఇసుక లారీలు మహాదేవపూర్‌‌‌‌–1 క్వారీలో 20 క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుక చొప్పున నింపుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ల వద్ద రూ.12 వేల విలువ చేసే వే బిల్లులున్నాయి. వాటిని పరిశీలిస్తే  నకిలీవని తేలింది. ఐడీ నెంబర్లు అన్నీ గతంలో వాడినవే. ఈ వ్యవహారంపై పోలీసులు ఏడుగురిపై కేసు పెట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వే బిల్లుల సృష్టికర్త టీఎస్‌‌‌‌ఎండీసీ ఉద్యోగే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మహాదేవపూర్‌‌-1 వద్ద సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌గా పనిచేసిన టీఎస్‌‌‌‌ఎండీసీ ఉద్యోగి ఒకరు పరారీలో ఉండడంతో ఈ అనుమానం బలపడుతోంది. డైలీ 2,500కు పైగా లారీల్లో కనీసం 200 నుంచి 300 లారీలు ఇలా నకిలీ వే బిల్లులతో క్వారీ దాటినట్టు ప్రాథమికంగా గుర్తించారు.