పెట్ డాగ్స్ పేరుతో క్రాస్​ బ్రీడ్ దందా

పెట్ డాగ్స్ పేరుతో క్రాస్​ బ్రీడ్ దందా
  • క్రాస్​ బ్రీడ్ చేసి ఒక్కో కుక్క పిల్ల 20 వేలకు అమ్మకం
  • దేశీయ కుక్కల బ్రీడ్​ కావడంతో వింత ప్రవర్తనలు 
  • భరించలేక రోడ్లపై వదిలేస్తున్న యజమానులు
  • సిటీలో ఏటేటా పెరిగిపోతున్న వీధి కుక్కలు

“ మలక్ పేట్​కు చెందిన ఓ వ్యక్తి ఏడాదిన్నరగా రెండు జాతి ఫీమేల్ డాగ్స్ పెంచుతున్నాడు. వాటికి క్రాసింగ్ టైంలో దేశీయ కుక్కలతో మేటింగ్ చేయించగా ఏడు పప్పీలు జన్మించాయి. వాటిని ఒక్కోటి రూ. 5 వేల చొప్పున అమ్మాడు. మూడు కుక్కలను ఓ యజమాని కొన్నాడు. నెలరోజుల్లోనే వాటి నిజ స్వరూపం తెలిసింది. పెట్ కేర్ సెంటర్​కు తీసుకెళ్లినా ఫలితం లేదు. ఏం చేయాలో తెలియక రోడ్డుపై వదిలేశాడు.’’ 

హైదరాబాద్, వెలుగు: సిటీలో జాతి కుక్కుల పేరిట దందా జోరుగా నడుస్తోంది. పెట్ ఫుడ్ షాప్స్​, కొందరు వెటర్నరీ డాక్టర్ల సహకారంతో వీటి బిజినెస్ సాగుతోంది. లాబ్రిడార్, డాబర్ మెన్, స్లెడ్జీ, గోల్డెన్ రిట్రైవర్, పమేరియన్ వంటి బ్రీడ్ల కుక్కలను పెంచుకునేందుకు ఇంట్రెస్ట్​ చూపుతారు.  లాక్ డౌన్ కారణంగా ఏడాది కాలంగా ఇంట్లో  కుక్కలను పెంచుకునేవారు ఎక్కువయ్యారు. దీంతో పెట్​డాగ్స్​ బిజినెస్ కు డిమాండ్​ పెరిగింది. అయితే కొందరు డాగ్​బ్రీడర్లు దేశీయ కుక్కలతో క్రాస్​ బ్రీడింగ్​చేయిస్తూ పప్పీలను వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాటి సహజ లక్షణాలపై అవగాహన లేకుండానే పైసల కోసం క్రాస్ బ్రీడింగ్ చేస్తూ పరోక్షంగా స్ట్రీట్ డాగ్స్ గా మారేలా చేస్తున్నారు.  బ్రీడర్లు ముందుగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు, వెటర్నరీ డిపార్ట్​మెంట్​పర్మిషన్స్​తీసుకోవాల్సి ఉంటుంది. పెంచుకునే వాటికి ఇచ్చే ఫుడ్​తో పాటు బీహెవియర్ పై వెటర్నరీ డాక్టర్ల సలహాల మేరకే పెంపకం ఉండాలి. కానీ ఇవేవి లేకుండా బ్రీడ్లకు ఉన్న డిమాండ్ తోనే క్రాస్ బ్రీడింగ్ చేస్తూ, జాతి కుక్కలంటూ నమ్మిస్తూ బిజినెస్ ​చేస్తున్నారు.

పెట్​కేర్​ సెంటర్లకు కాల్స్
గతేడాది కాలంగా ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్కలు తిరగబడుతున్నాయని, వింతగా  ప్రవర్తిస్తున్నా యని పెట్ కేర్ సెంటర్లకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అయితే వీటి మూలాలపై స్టడీ చేయగా క్రాస్ బ్రీడింగ్ కారణంగానే  ఇలాంటి అవ లక్షణాలు బయటపడుతున్నాయని, ముఖ్యంగా ఒకే జాతి బ్రీడ్ కాకపోవడంతో అనారోగ్యంగా ఉంటూ  వింతగా  ప్రవర్తిస్తున్నాయని పెట్ డాగ్ నిర్వాహకులు చెబుతున్నారు.

పర్మిషన్స్​ లేకుండా షాప్స్ నిర్వహణ
డాగ్ బిజినెస్ చేయాలంటే ముందుగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు పర్మిషన్ ​తీసుకోవాలి. కుక్క పిల్లలను అమ్మే ముందు కచ్చితంగా మేల్, ఫీమెల్ బ్రీడ్ ను కొనుగోలుదారులకు చూపాలి. ఎలాంటి ప్రభుత్వ అనుమతుల్లేకుండానే సిటీలో పెట్స్ షాప్ నిర్వహిస్తున్నట్లు పెట్ లవర్స్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి70కి పైగా గుర్తించినా, ఇవి వందల్లోనే ఉండొచ్చంటున్నారు. ఏడాదికోసారి క్రాసింగ్​కు వచ్చే కుక్కలకు హార్మోన్స్ ఇస్తూ రెండుసార్లు  చేయిస్తున్నారు.  ఇలా  పెంపుడు కుక్కల పేరిట వేలల్లో దందా కొనసాగుతుండడమే కాకుండా, ప్రత్యక్షంగా వీధి కుక్కలు పెరిగేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  వింతగా ప్రవర్తిస్తుంటే భరించలేక యజమానులు రోడ్లపై వదులుతుండడంతో వీధి కుక్కలుగా మారుతున్నాయని పెట్ లవర్స్ పేర్కొంటున్నారు. స్ట్రీట్ డాగ్ ప్రొటెక్టర్లకు కంప్లయింట్లు చేసినా అధికారుల నుంచి స్పందన లేదంటున్నారు. బిజినెస్​పెంచుకునేందుకు పెట్ ఫుడ్ నిర్వాహకులు, వెటర్నరీ డాక్టర్లు కీలకంగా వ్యవహరిస్తుండగా పెట్ డాగ్స్ కు డిమాండ్​పెరిగింది.  

క్రాస్​ బ్రీడింగ్​ జరిగితే.. 
ఏడేళ్లుగా క్వాలిటీ బ్రీడ్ డాగ్స్ పెంచుతున్నా. వెటర్నరీ డాక్టర్ అయిన ఫ్రెండ్ సాయంతో క్వాలిటీ, ఫ్రెండ్లీ డాగ్స్ ను మాత్రమే పెంచుతున్నా. ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటోన్న యువకులు, కాలేజ్ స్టూడెంట్లు కూడా పెంచుతున్నారు. కానీ వాటి మేటింగ్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే క్రాస్ బ్రీడింగ్ జరిగితే  ఇబ్బందులు వస్తాయి. 
– రాజశేఖర్, పెట్ డాగ్ నిర్వాహకుడు