Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా.. సెమీస్‌లో ఇంగ్లాండ్ ఘోర ఓటమి

Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా.. సెమీస్‌లో ఇంగ్లాండ్ ఘోర ఓటమి

మహిళల వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా ఫైనల్ కు దూసుకెళ్లింది. బుధవారం (అక్టోబర్ 29) ఇంగ్లాండ్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో 125 పరుగుల భారీ తేడాతో గెలిచి తుది సమరానికి అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ లో లారా వోల్వార్డ్ట్ 169 పరుగులతో భారీ సెంచరీతో విరుచుకుపడడంతో పాటు ఆ తర్వాత బౌలింగ్ లో కప్ 5 వికెట్లతో చెలరేగింది. ఆదివారం (నవంబర్ 2) ఆస్ట్రేలియా లేదా ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులకు చేసింది. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.

320 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఘోరమైన ఆరంభం లభించింది. టాపార్డర్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. అమీ జోన్స్, టామీ బ్యూమాంట్,హీథర్ నైట్ డకౌటయ్యారు. ఒక పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను నాట్ స్కైవర్-బ్రంట్ (64), ఆలిస్ కాప్సే (50) జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి నాలుగో వికెట్ కు 107 పరుగులు జోడించారు.

వీరిద్దరి జోడీని సునే లూస్ విడగొట్టి సౌతాఫ్రికాపై బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆ తర్వాత కప్ చెలరేగి వికెట్లను తీసింది. నాట్ స్కైవర్-బ్రంట్ తో పాటు సోఫియా డంక్లీ, షార్లెట్ డీన్ వికెట్లు తీసుకొని మ్యాచ్ ను పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిప్పింది. టైలండర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లాండ్ 194 పరుగులకే ఆలౌటైంది. 169 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన వోల్వార్డ్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

సెంచరీతో హోరెత్తించిన లారా వోల్వార్డ్ట్:

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులకు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు వోల్వార్డ్ట్, బ్రిట్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. వీరి బ్యాటింగ్ ధాటికి స్కోర్ అలవోకగా వచ్చింది. తొలి వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 116 పరుగులు జోడించి మంచి స్టార్ట్ ఇచ్చారు. 45 పరుగులు చేసి బ్రిట్స్ ఔట్ కావడంతో సౌతాఫ్రికాతోలి వికెట్ కోల్పోయింది. తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించి స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు పడగొట్టారు. అన్కె బోష్ డకౌట్ కాగా.. సునే లూస్ ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరింది.

119 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ ప్లేయర్ కప్ తో కలిసి వోల్వార్డ్ట్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. నాలుగో వికెట్ కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. అయితే సౌతాఫ్రికా మరోసారి వరుసగా వికెట్లు కోల్పోయినా వోల్వార్డ్ట్ డిర్క్ సన్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ఈ సౌతాఫ్రికా కెప్టెన్ తన సెంచరీ పూర్తి చేసుకుంది. 48 ఓవర్ వోల్వార్డ్ట్ బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా స్కోర్ 300 పరుగులు దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లు తీసుకుంది. లారా బెల్ రెండు.. బ్రాంట్ ఒక వికెట్ తీసుకుంది.