ఐదు దశాబ్దాలుగా తన నటనా శైలి, స్టైల్, మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ . నేటి యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 75 ఏళ్ల వయసులోనూ అదే జోష్, అదే స్వాగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన సిగరెట్ తిప్పే స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. .
వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ
ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలోనే ఆ సినిమా సీక్వెల్ 'జైలర్ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో రమ్య కృష్ణ, విద్యాబాలన్ కీలక పాత్రలతో నటించనున్నారు. 'జైలర్ 2' తర్వాత రజనీకాంత్ తన చిరకాల మిత్రుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. వీరిద్దరూ సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కలిసి నటించనున్న నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టు కోసం సినీ వర్గాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రిటైర్మెంట్ వార్తలపై అభిమానుల ఆవేదన
ఈ భారీ ప్రాజెక్టుల మధ్య లేటెస్ట్ గా రజనీకాంత్ కెరీర్‌లో కమల్ హాసన్‌తో చేయబోయే మల్టీస్టారరే చివరిది కావచ్చు అనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్ ఇకపై రిటైర్ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలు ఆయన అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. సినిమాల్లోనే కొనసాగాలని, ఇంకా కొత్త పాత్రలు చేయాలని వారు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, రజనీకాంత్ గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన మాటలే. నా జీవితం సినిమానే. నేను శ్వాస తీసుకుంటున్నంత వరకూ నటిస్తూనే ఉంటాను అని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు.
►ALSO READ | Deepika Padukone : ఓటీటీలో దీపికా పదుకొణె క్రెడిట్స్ తొలగింపు.. 'కల్కి 2898 AD' నిర్మాతలపై నెటిజన్ల ఆగ్రహం!
సుదీర్ఘ కెరీర్‌లో వచ్చిన ఈ ఊహాగానాలపై రజనీకాంత్, ఆయన టీమ్ ఎలా స్పందిస్తారు? అభిమానుల కోరిక మేరకు ఆయన ఈ వార్తలను లైట్ తీసుకుంటారా? లేక, కమల్‌తో సినిమా తర్వాత ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదేమైనా, ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే అది అభిమానులకు మాత్రం ఎప్పటికీ పండుగే అని చెప్పాలి.
