Deepika Padukone : ఓటీటీలో దీపికా పదుకొణె క్రెడిట్స్ తొలగింపు.. 'కల్కి 2898 AD' నిర్మాతలపై నెటిజన్ల ఆగ్రహం!

Deepika Padukone : ఓటీటీలో దీపికా పదుకొణె క్రెడిట్స్ తొలగింపు.. 'కల్కి 2898 AD' నిర్మాతలపై నెటిజన్ల ఆగ్రహం!

సినీ బాక్సాఫీప్ వద్ద సంచనం సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ ను  నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పేరును మేకర్స్ తొలగించారంటూ.. సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.  ఇప్పటికే 'కల్కి 2' సీక్వెల్ నుంచి దీపికా వైదొలగిన నేపథ్యంలో..  ఓటీటీలో ఆమె పేరును కూడా తొలగించడంపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎండ్ క్రెడిట్స్‌లో పేరు మాయం

'కల్కి 2898 AD' ఓటీటీ వెర్షన్‌లో దీపికా పదుకొణె పేరు ఎండ్ క్రెడిట్స్‌లో కనిపించడం లేదని ఆమె అభిమానులు గుర్తించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ, మేకర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని X లో వీడియో షేర్ చేస్తూ..  'కల్కి పార్ట్ 1' ఓటీటీ వెర్షన్ ఎండ్ క్రెడిట్స్ నుంచి దీపికా పదుకొణె పేరును తొలగించడం అత్యంత దారుణమైన చర్య. ఆమె పేరును తొలగించినంత మాత్రాన సినిమాలో ఆమె పాత్ర ప్రభావం తగ్గిపోతుందా? అసలు ఇలాంటి నిర్మాణ సంస్థ ఉండడం సిగ్గుచేటు అంటూ ఘాటుగా విమర్శించారు. 

 

మరొక నెటిజన్ స్పందిస్తూ.. సినిమా క్రెడిట్స్ అంటే కేవలం పేర్లే కాదు. నటీనటులు పెట్టిన కృషికి, వృత్తి ధర్మానికి ఇచ్చే గౌరవం. కథకు భావోద్వేగ గుండెకాయ లాంటి పాత్ర పోషించిన దీపికాకు గుర్తింపు లేకపోవడం అన్యాయం అని కామెంట్ చేశారు. నిజానికి, సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు కూడా మొదట దీపికా పేరు క్రెడిట్స్‌లో లేదని, ఫ్యాన్స్ విజ్ఞప్తితోనే తర్వాత యాడ్ చేశారని, ఇప్పుడు మళ్లీ తొలగించారని మరికొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

 

సీక్వెల్ నుంచి తొలగింపు 

దీపికా పదుకొణె 'కల్కీ సీక్వెల్‌' నుంచి తప్పుకుంటున్నట్లు  నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. 'కల్కి 2898 AD యొక్క రాబోయే సీక్వెల్‌లో @deepikapadukone భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా ఆలోచనల తర్వాత, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. 'కల్కి 2898 AD' లాంటి సినిమాకు పూర్తి నిబద్ధత అవసరం. భవిష్యత్ ప్రాజెక్టులకు ఆమెకు శుభాకాంక్షలు అని వైజయంతీ మూవీస్ తెలిపింది.

►ALSO READ | Malavika Mohanan: చిరుతో కాదు.. ప్రభాస్ సరసన చేస్తున్నా.. పుకార్లకు చెక్ పెట్టిన మాళవిక మోహనన్!

అయితే దీపికా పదుకొణె సీక్వెల్ కోసం భారీగా పారితోషికంతో పాటు రోజుకు కేవలం 7 నుండి 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని షరతులు విధించడం మేకర్స్‌కు నచ్చలేదని తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ ఆధారిత భారీ బడ్జెట్ సినిమా కావడంతో, ఆమె కండిషన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను, బడ్జెట్‌ను అదుపు తప్పేలా చేస్తాయని మేకర్స్ భావించారని సమాచారం. కల్కీ 2898 AD చిత్రంలో ప్రభాస్ 'భైరవ', అమితాబ్ బచ్చన్ 'అశ్వత్థామ'లతో పాటు, గర్భవతి అయిన 'సుమతి' పాత్రలో దీపికా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది.  సీక్వెల్ నుంచి వైదొలగడంపై, ఇప్పుడు ఆమె పేరు క్రెడిట్స్‌లో మాయం కావడంతో సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది.