వాగులు దాటి.. గుట్టలెక్కి.. గిరిజనులకు వైద్యసేవలు.. అడవిలో 12 కి.మీ నడిచి వైద్య సిబ్బంది సాహసం

వాగులు దాటి.. గుట్టలెక్కి.. గిరిజనులకు వైద్యసేవలు.. అడవిలో 12 కి.మీ నడిచి వైద్య సిబ్బంది సాహసం

కాగజ్ నగర్, వెలుగు: అడవి మధ్యలో ఉండే ఆ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. వాగులు దాటి.. గుట్టలెక్కి చేరుకోవాల్సిందే..!  వైద్య సిబ్బంది సుమారు12 కిలోమీటర్లు సాహస యాత్ర చేసి మెడికల్ క్యాంప్ నిర్వహించి సేవలు అందించారు. ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అడవిలో ఉండే అత్యంత మారుమూల ఆదివాసీ గూడెమైన మాణిక్ పటార్ కు రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ దాదాపు 165 మంది గిరిజనులు నివసిస్తుంటారు. మంగళవారం ఉదయం మెడికల్ సిబ్బంది కాగజ్ నగర్ మండలం ఊటుపల్లి మీదుగా మాణిక్​ పటార్ గ్రామానికి వాగులు దాటుకుంటూ.. గుట్టలెక్కి వెళ్లి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.

హెచ్ఈఓ నరేశ్,​ ఏఎన్ఎం లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ యువరాజ్ కర్రల సాయంతో వ్యాక్సిన్, స్ప్రేయర్ మోసుకుని వెళ్లారు. ఊరిలో మలేరియా నివారణకు స్ప్రే కొట్టారు.  స్కూల్  పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. గూడెంవాసులు జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  అవగాహన కల్పించారు. భారీ వర్షాలతో జ్వరాలు విజృంభిస్తున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా  మెడికల్ క్యాంపు నిర్వహించినట్టు  హెచ్ఈఓ నరేశ్ తెలిపారు.  వైద్య సిబ్బంది సేవలకు  గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు.