
- జనసంద్రంగా ఖైరతాబాద్
- లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్,
- మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ జామ్
- పంజాగుట్ట నుంచి స్లో మూవ్మెంట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. విశ్వశాంతి గణేశుడి వద్ద130 జంటలతో కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి, గణపతి దర్శనానికి వచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బడా గణేశ్ దర్శనానికి అనుమతిస్తున్నారు.
అయితే, తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసికనిపిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భక్తుల తాకిడి కారణంగా ఫుల్ట్రాఫిక్జామ్ అవుతోంది. సోమవారం కూడా ఖైరతాబాద్ నుంచి మొదలుపెడితే లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం వరకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రద్దీ కారణంగా పీవీఎన్ఆర్ హైవేపై కూడా వాహనాలు జామ్ అయ్యాయి.
లక్డీకాపూల్జంక్షన్ నుంచి మాసబ్‌ట్యాంక్ చేరడానికి సుమారు గంటకు పైగానే పట్టింది. మెహిదీపట్నం నుంచి మాసబ్ట్యాంక్వచ్చేవాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి 40 నిమిషాలకు పైగానే పట్టింది. మరోవైపు పంజాగుట్ట నుంచి మొదలుపెడితే ఎర్రమంజిల్, ఖైరతాబాద్ వరకు వాహనాలు చాలా ఆలస్యంగా కదిలాయి. సోమవారం సాయంత్రం నటుడు మంచు మనోజ్ స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.