మార్చి నెలా ఖరులో గా రూ.15 వేల కోట్లు రాబట్టాలి : సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు

మార్చి నెలా  ఖరులో గా రూ.15 వేల కోట్లు రాబట్టాలి : సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు
  • కేంద్ర నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లపై దృష్టి పెట్టండి: సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు​ 
  •     రాష్ట్రవ్యాప్తంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్‌‌‌‌తో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అధికారులు వేగంగా స్పందించాలని, ఇందుకు సంబంధించి పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎస్ కె.రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రాయోజిత పథకాల బకాయిలను మార్చి నెలాఖరులోగా సమీకరించుకునేలా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. 

కేంద్ర నుంచి ఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఏ నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు సహా ఇతర పథకాల కింద రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్యా, వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి సుమారు రూ.15 వేల కోట్ల మేర నిధులు రావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నిధుల సాధన కోసం ఢిల్లీలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకొని కేంద్ర మంత్రులు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 100 డేస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ సిద్ధం చేయాలన్నారు. మార్చి 2 లేదా 3వ తేదీ నుంచి జూన్‌‌‌‌ 2 వరకు వివిధ విభాగాల వారీగా అభివృద్ధి పనుల ప్రణాళిక అమలు కావాలని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్య, విద్యా శాఖల్లో ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేసేలా పర్యవేక్షణను ముమ్మరం చేయాలని, ప్రతి రోజూ పురోగతిని సమీక్షించాలని శాఖాధిపతులకు మార్గనిర్దేశం చేశారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించాలని సీఎస్‌‌‌‌ సూచించారు. 

గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రానున్న కేబినెట్‌‌‌‌ సమావేశానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను మంగళవారంలోగా సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్‌‌‌‌లు వికాస్ రాజ్, సీవీ ఆనంద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, అహ్మద్ నదీమ్, ఎన్.శ్రీధర్, యోగితారాణా పాల్గొన్నారు.