హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో విభాగాల వారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఈ నెల 16న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియెట్‌లో అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
డిపార్ట్మెంట్ల వారీగా నోడల్ ఆఫీసర్‌ను నియమించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తేనీటి విందులో పాల్గొంటారని చెప్పారు. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారని తెలిపారు. బ్లూ బుక్, వీవీఐపీ ప్రొటోకాల్ మాన్యువల్ ప్రకారం తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను పోలీసు శాఖకు సూచించారు.
ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 21న రాష్ట్రానికి వస్తున్నారని, రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసి 22వ తేదీన పుట్టపర్తికి వెళ్తారని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలపై జీఏడీ, ఫైర్ సర్వీస్, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, మున్సిపల్, బీఎస్ఎన్ఎల్, హార్టికల్చర్ విభాగాలు నిర్దేశించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు వ్యక్తిగతంగా ఏర్పాట్లపై పర్యవేక్షించాలన్నారు. ప్రొటోకాల్, భద్రత ఏర్పాట్లు సజావుగా ఉండాలని, కార్యక్రమానికి ముందు రోజు ఏఎస్ఎల్, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ రివ్యూలో డీజీపీ శివధర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
