గ్లోబల్ స్థాయిలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్’..సదస్సు నిర్వహణపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష

గ్లోబల్ స్థాయిలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్’..సదస్సు నిర్వహణపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. డిసెంబర్‌‌లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమిట్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని, ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కూడా సమిట్‌‌కు ఆహ్వానించాలని సూచించారు.

అలాగే, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, శాస్త్ర-సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల ప్రముఖులను సమిట్‌‌లో పాల్గొనేలా ముందుగానే ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. సమిట్‌‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమ్మిట్ నిర్వహణకు మార్గదర్శకత్వం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సలహా మండలిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి  తదితరులు పాల్గొన్నారు