
- సైబర్ జాగృతా దివస్' పేరిట సీఎస్‌బీ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ప్రయత్నాలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) ముమ్మరం చేసింది. బుధవారం ఒక్కరోజే ‘సైబర్ జాగృతా దివస్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 577 అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్కూల్స్, కాలేజీల విద్యార్ధులు, టీచర్లు, లెక్చరర్లలో సైబర్ సేఫ్టీ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించింది. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ యూనిట్ పరిధిలోని విద్యాసంస్థల్లో సీఎస్‌బీ సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్, లోన్ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్ మోసాలు వంటి సైబర్ నేరాల గురించి విద్యార్థులకు ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు డిజిటల్ ప్రపంచంలో తమను తాము రక్షించుకునే విధానాలను తెలియజేశారు. సోషల్ మీడియాలో #CyberJaagrooktaDiwas హ్యాష్‌ట్యాగ్‌తో విస్తృత ప్రచారం చేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను విడుదల చేసి, ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. యువతను సైబర్ సురక్షితంగా ఉంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సైబర్ నేరాలను నిరోధించడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సీఎస్‌బీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.