
- 20 మంది నిందితులు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల (ఒకరి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ మరొకరు వినియోగించుకోవడం) పై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) నజర్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలు సహా 1930 ద్వారా సేకరించిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా గుజరాత్‌లో అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించింది.
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఏజెంట్లు, మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు లావాదేవీల్లో సహకరిస్తున్న ముఠాల గుట్టును టీజీసీఎస్ బీ రట్టు చేసింది. సెర్చ్ ఆపరేషన్ వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈనెల 1 నుంచి 10 వరకు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించి 20 మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు. వారిలో 14 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు కాగా ఆరుగురు ఏజెంట్లు ఉన్నారని వెల్లడించారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణలో నమోదైన 60కి పైగా సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల లావాదేవీలు
తెలంగాణలోని ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ప్రాథమిక విచారణలో 27 మ్యూల్ ఖాతాలతో దేశవ్యాప్తంగా రూ.44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని శిఖా గోయల్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా రూ. 22.64 కోట్లు విత్‌డ్రా చేసుకున్నట్టు సీఎస్‌బీ అధికారుల దర్యాప్తులో తేలిందని ఆమె తెలిపరు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఒక బ్యాంకు ఉద్యోగి ఉన్నారని వివరించారు.