V6 News

IPL నుంచి ఆయుష్ మాత్రే ఔట్.. చెన్నై జట్టుకు పెద్ద దెబ్బే.. MIతో మ్యాచ్లో మాత్రే ప్లేస్లో ఎవరంటే..

IPL నుంచి ఆయుష్ మాత్రే ఔట్.. చెన్నై జట్టుకు పెద్ద దెబ్బే.. MIతో మ్యాచ్లో మాత్రే ప్లేస్లో ఎవరంటే..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏప్రిల్ 18న జరిగిన సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రన్నింగ్ చేస్తున్న సమయంలో ఆయుష్ మాత్రేకు ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. ఈ గాయం నుంచి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయుష్ మాత్రే ఈ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి దూరమైనట్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ ఐపీఎల్ సీజన్లో ఆయుష్ మాత్రే బ్యాటింగ్లో మంచిగానే రాణించాడు. రాజస్తాన్, ఆర్సీబీ మ్యాచ్లను మినహాయిస్తే.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 73 పరుగులు, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 59 పరుగులు, కేకేఆర్ మ్యాచ్లో 38 పరుగులు, SRH మ్యాచ్లో 30 పరుగులు చేశాడు. ఆయుష్ గాయం నుంచి కోలుకోవడానికి 6 నుండి 12 వారాల సమయం పడుతుందని, అతను త్వరగా కోలుకోవాలని CSK ఆకాంక్షించింది. 

ఈ సీజన్‌లో మాత్రే 177.87 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతనిని సీజన్ మొత్తానికే కోల్పోవడం CSK జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆయుష్ మాత్రే చేరాడు. సీజన్ మధ్యలో కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో మాత్రేను చెన్నై తీసుకుంది. తొలి సీజన్లో కూడా మాత్రే అద్భుతంగా రాణించాడు. ఓపెనర్గా ఆడిన ఈ యువ బ్యాటర్ 2025లో 7 ఐపీఎల్ మ్యాచ్ల్లో 190 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేయడం విశేషం.

►ALSO READ | SRH vs DC మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేది మాత్రం ఈ జట్టే

2026 ఐపీఎల్ సీజన్లో మాత్రేను చెన్నై రిటైన్ చేసుకుంది. ఆయుష్ మాత్రేను ఫ్యూచర్ సూపర్ స్టార్గా భావించి రిటైన్ చేసుకున్న చెన్నైకి సీజన్ మధ్యలోనే మాత్రే నిష్క్రమించడం నిరాశ కలిగించింది. ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ముందున్న రెండు మ్యాచ్లు కూడా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్తో కావడం గమనార్హం. CSK జట్టులో మార్పులుచేర్పులను పరిశీలిస్తే.. వాంఖడే స్టేడియంలో MIతో సూపర్ కింగ్స్ తలపడనున్న మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ మాత్రే స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

ఉర్విల్ కూడా మంచి హిట్టర్ కావడం CSK జట్టుకు కలిసొచ్చే అంశం. ఉర్విల్ పటేల్.. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 28 బంతుల్లోనే త్రిపురపై సెంచరీ కొట్టి ఇండియన్ క్రికెట్ చరిత్రలోకి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. అంతే కాదు.. ఈ సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఉర్విల్ పటేల్ ను రూ. 30 లక్షలకు CSK తమ జట్టులోకి చేర్చుకుంది. ఆయుష్ మాత్రే స్థానాన్ని దాదాపు ఉర్విల్ పటేల్తోనే భర్తీ చేసే అవకాశం ఉంది.