భూదాన్ పోచంపల్లి, వెలుగు: కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలని క్యాప్ జెమిని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీటీవో -ముకేశ్ జైన్ సూచించారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖి విజ్ఞాన్ యూనివర్సిటీలో కెరీర్ క్లారిటీ ఇన్ టెక్ అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్ ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుందని, ఈ రంగంలో విజయం సాధించాలంటే కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు.
ఏవైనా సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని పరిష్కరించేందుకు సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో నూతన అవకాశాలుగా మార్చుకోవాలని హైదరబాద్‌లోని ఏఆర్‌సీఐ డైరెక్టర్ విజయ్ సూచించారు. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
