- పుష్కలంగా నీటివనరులు
- పెరిగిన భూగర్భజలాలు
- నిండు కుండలా చెరువులు
మెదక్, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్లో సాగు విస్తీర్ణం పెరగనుంది. 2024 -–- 25 యాసంగి సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి 2,96,531 ఎకరాల్లో పంటలు సాగు కాగా సాగునీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని 2025 -–- 26లో 20 వేల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గడిచిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలో కుండ పోత వానలు కురిశాయి. చాలా మండలాల్లో సాధారణం కంటే వంద శాతం ఎక్కువ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.
మంజీరా నది, హల్దీ వాగు, పుష్పాల వాగు, పసుపు లేరు వారు, గుండు వాగు అనేక రోజుల పాటు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో భూగర్భజలాలు పెరిగి వృద్ధి చెంది బోర్లలో నీటి మట్టాలు పెరిగాయి. ఈ యాసంగి సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 3,17,380 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,95,200 ఎకరాల్లో వరి సాగు కానుంది. సాధారణంగా యాసంగి సీజన్లో ఆరు తడి పంటలు ఎక్కువగా వేస్తారు. కానీ సాగు నీరు పుష్కలంగా ఉండడంతో మెజారిటీ రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
విత్తనాల అవసరం ఇలా..
యాసంగి సీజన్ లో సాగు చేసే వరి కోసం 73,800 క్వింటాళ్ల వరి విత్తనాలు, 299 క్వింటాళ్ల జొన్న విత్తనాలు, 248 క్వింటాళ్ల మొక్కొజొన్న విత్తనాలు, 12 క్వింటాళ్ల సన్ ఫ్లవర్ విత్తనాలు, 78 క్వింటాళ్ల శెనగ విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆయా విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది.
56,523 టన్నుల ఎరువులు
యాసంగి సీజన్లో సాగు చేసే అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 56,523 టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 27,064, డీఏపీ 2,050, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2,343, కాంప్లెక్స్ ఎరువులు 24,041, సింగల్ సూపర్ ఫాస్సెట్ 1,025 టన్నులు అవసరం కానున్నాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ డీలర్ల వద్ద అవసరమైన మేర ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యవసాయాధికారులు తెలిపారు.
