అద్దె ఇంట్లో మెడికోల గంజాయి సాగు

అద్దె ఇంట్లో మెడికోల గంజాయి సాగు

శివమొగ్గ: అద్దెకు తీసుకున్న ఇంట్లో హైటెక్ పద్ధతుల్లో గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు మెడికల్ స్టూడెంట్ల(మెడికోల) ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలోని శివమొగ్గలో ఈ ఘటన వెలుగుచూసింది. మరో ఘటనలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మెడికల్ స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసుల వివరాలను శివమొగ్గ ఎస్పీ జీకే మిథున్ కుమార్ ఆదివారం వెల్లడించారు.

తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన విజ్ఞరాజ్ (28), ధర్మపురికి చెందిన పాండిదొరై (27), కేరళలోని ఇడుక్కికి చెందిన వినోద్ కుమార్ (27) మెడికల్ స్టూడెంట్లు. వీళ్లు ముగ్గురూ శివమొగ్గలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు. కాలేజీకి దగ్గర్లోనే రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే వీళ్లు అదే రూమ్ లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. ఇందుకోసం హైటెక్ ఫార్మింగ్ విధానాలను అనుసరిస్తున్నారు. అవసరమైన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నారు. 

మూడున్నర నెలలుగా.. 

ఈ ముగ్గురూ మూడున్నర నెలలుగా గంజాయి సాగు చేస్తూ.. దాన్ని లోకల్స్, కాలేజీ స్టూడెంట్లకు అమ్ముతున్నారు. పొడి గంజాయిని చిన్న సాచెట్స్ లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. వాళ్లు గంజాయి పండించేందుకు రూమ్ లో చేసిన సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. అక్కడున్న సామగ్రితో పాటు కిలోన్నర గంజాయి, చరస్, గంజాయి విత్తనాలు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో ఘటనలో గంజాయి అమ్ముతున్న మెడికల్ విద్యార్థులు అబ్దుల్ ఖయ్యుమ్(25), అర్పిత(23) లను పోలీసులు అరెస్టు చేశారు.