ఇరిగేషన్​ భూముల్లో తోటల పెంపకం: సీఎస్​ శాంతి కుమారి

ఇరిగేషన్​ భూముల్లో తోటల పెంపకం: సీఎస్​ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడవుల సంరక్షణలో భాగంగా ఇరిగేషన్ భూముల్లో కూడా తోటల పెంపకాన్ని చేపట్టినట్లు సీఎస్​శాంతికుమారి తెలిపారు. బీఆర్‌‌కేఆర్ భవన్‌‌లో ఇరిగేషన్​ భూముల్లో ప్లాంటేషన్‌‌ అంశంపై బుధవారం వర్క్‌‌ షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌‌ షాప్‌‌నకు జోగులాంబ గద్వాల్‌‌, నిజామాబాద్‌‌, మహబూబ్‌‌నగర్‌‌, మెదక్‌‌, నాగర్‌‌కర్నూల్‌‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ..హరితహారం స్కీముతో రాష్ట్రంలోని అడవులను పునరుద్ధరించడమే కాకుండా.. వాటిని స్మగ్లింగ్, ఆక్రమణలు, అగ్నిప్రమాదం నుంచి కూడా కాపాడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో పచ్చదనం గతంలో కంటే 7.7 శాతం పెరిగిందని ఆమె వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు గతేడాది నుంచి ఇరిగేషన్​ భూముల్లో తోటల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. బ్లాక్‌‌ ప్లాంటేషన్‌‌తో గ్రామాలకు ఆదాయం సమకూరేలా ప్రణాళికలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో  స్పెషల్​ సీఎస్​ రజత్‌‌కుమార్‌‌,  పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌‌ కుమార్‌‌ సుల్తానియా, పీసీసీఎఫ్‌‌ ఆర్‌‌ఎం డోబ్రియాల్‌‌ తదితరులు పాల్గొన్నారు.