- సీఎం అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్, సీఎస్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ
- పట్టణాభివృద్ధి ప్రణాళికలు, విధాన నిర్ణయాలకు అపెక్స్ కౌన్సిల్
- శాఖల మధ్య సమన్వయం, ప్రాజెక్టుల అమలుపై ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్యవేక్షణ
- నిర్ణయాల అమలుపై మూడు నెలలకోసారి సమావేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో పట్టణ పాలనను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. క్యూర్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం–2026 కింద క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ గురువారం జీఓ 251, 252 జారీ చేసింది. పట్టణాభివృద్ధికి సంబంధించిన విధాన నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనతో పాటు, వివిధ శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి పనుల అమలును పర్యవేక్షించడం ఈ రెండు కమిటీల ప్రధాన ఉద్దేశం.
సీఎం అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్
క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్‌కు సీఎం ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇన్చార్జి మంత్రి సభ్యుడిగా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. కౌన్సిల్ ముందుకు వచ్చే అంశాలకు సంబంధించిన శాఖల మంత్రులను ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రత్యేక సభ్యులుగా చేర్చనున్నారు. అవసరాన్ని బట్టి ఇతరులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. క్యూర్ పరిధిలో పట్టణాల అభివృద్ధి ఎలా ఉండాలి? పాలనను ఎలా కొనసాగించాలి? ఏయే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి? అనే అంశాలను కౌన్సిల్ నిర్ణయిస్తుంది. వివిధ శాఖలు చేపట్టే విధానాలు, పథకాలు, పెట్టుబడుల మధ్య సమన్వయం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. సమావేశాల నిర్వహణను కూడా కౌన్సిల్ నిర్ణయిస్తుంది.
శాఖల సమన్వయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ
క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. క్యూర్ పరిధిలోని కార్పొరేషన్ల కమిషనర్లు, సంబంధిత పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జలమండలి ఎండీ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ, టీజీఎస్ఆర్టీసీ ఎండీ, హైడ్రా కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అవసరాన్ని బట్టి ఇతరులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ఈ కమిటీ కనీసం మూడు నెలలకోసారి సమావేశమై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల అమలును సమీక్షిస్తుంది క్యూర్ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులు, పథకాలు, ప్రభుత్వ ఆదేశాల అమలు పురోగతిని పర్యవేక్షిస్తుంది. అపెక్స్ కౌన్సిల్, ప్రభుత్వం అప్పగించే ఇతర బాధ్యతలను కూడా నిర్వహిస్తుంది. ఈ రెండు కమిటీలతో పట్టణాభివృద్ధి ప్రణాళికలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
