- వెన్నెముక కండరాలు క్షీణించినవారికి, వీల్ చైర్ వాడేవారికి ఉపయోగం
మాదాపూర్, వెలుగు: వెన్నెముక కండరాల క్షీణత (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ -ఎస్‌ఎమ్‌ఎ)తో బాధపడుతున్నవారు, వీల్చైర్వాడే వారి కోసం క్యూర్ ఎస్‌ఎమ్‌ఎ ఫౌండేషన్ ‘ఇ–స్వయం’ పేరిట ఓ వినూత్న అప్లికేషన్‌ను డెవలప్చేస్తోంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని హోటల్ రెడ్ ఫాక్స్‌లో ఈ - స్వయం డిజిటల్ యాక్సెసిబిలిటీ మ్యాప్ ప్రివ్యూ, సాఫ్ట్ లాంచ్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది.
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్ఎంఆర్ఎల్, ఐసీఐసీఐ, సీఎస్ఐఆర్సీసీఎంబీ , సౌత్ కోస్ట్ రైల్వేస్ నుంచి నిపుణులు హాజరై ఈ స్వయం గురించి చర్చించారు. ఈ ఏడాది మొబిలిటీ యాక్సెసిబిలిటీతో ఈ –స్వయం ప్రారంభమవుతుందని, దశలవారీగా 2027 నాటికి అన్ని రకాల వైకల్యాలకూ అప్లికేషన్ద్వారా సేవలందుతాయన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ వై. సాయప రెడ్డి , యూఎన్డీపీ డెవలప్‌మెంట్ గోల్స్ స్పెషలిస్ట్ అలగప్పన్ , టీజీఐజీ మాజీ డైరెక్టర్, సన్‌లిట్ పాత్ కన్సల్టింగ్ సీఈవో అర్చన, రెయిన్‌బో హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పీడబ్ల్యూడీ విభాగం డిప్యూటీ చీఫ్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అంబష్ట వర్చువల్ గా పాల్గొన్నారు.
