కరెంట్​ తీగలకు తగులుతున్నాయని.. మహిళతో  చెట్టు కొమ్మలు కొట్టించారు

కరెంట్​ తీగలకు తగులుతున్నాయని.. మహిళతో  చెట్టు కొమ్మలు కొట్టించారు

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా జామాండ్లపల్లిలో   చెట్టు కొమ్మలు  తగిలి ఎర్తింగ్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి  విద్యుత్ అధికారులు ఓ మహిళతో ఆ చెట్టును కొట్టించారు.   ధనమ్మ అనే  మహిళ ఇంటి ఆవరణలో  వేప చెట్టు ఉంది.  కొమ్మలు కొట్టిన తర్వాతనే కరెంట్ సరఫరా చేస్తామని ఆమెను అధికారులు హెచ్చరించారు. తాను వితంతువునని, ఒంటరిగా ఉంటున్నానని అధికారులను ప్రాథేయపడింది.  

అయినా వారు వినలేదు.  చేసేది ఏమిలేక ధనమ్మ చెట్టెక్కి కొమ్మలు కొట్టింది. దీన్ని  అందరూ చూశారే తప్ప సాయం చేయలేదు.  బాధను దిగమింగుకొని నాలుగు రోజులు కష్టపడి చెట్టు కొమ్మలు కొట్టింది.  వితంతువుపై అత్యుత్సాహం ప్రదర్శించి ఆమె చేతనే చెట్టు కొమ్మలు కొట్టించడంపై  గ్రామస్తులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.   విద్యుత్​ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.