కరెంటు కాటేసింది.. ముగ్గురు రైతులు మృతి

కరెంటు కాటేసింది.. ముగ్గురు రైతులు మృతి

కామారెడ్డి, వెలుగు:పొలం వద్ద కాలిపోయిన మోటార్​ను తొలగిస్తుండగా కరెంట్ షాక్​ తగిలి ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. బోరు మోటార్​ను పైకి తీస్తుండగా ఇనుప పైపులకు కరెంటు తీగలు తగలడంతో ముగ్గురికి షాక్​ కొట్టి అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో ఈ దారుణం జరిగింది. రైతుల కుటుంబ సభ్యులు, పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. వెల్పుగొండ గ్రామానికి చెందిన స్వామిగౌడ్​ పొలంలో వ్యవసాయ బోరుల మోటార్​కాలిపోయింది. అదే గ్రామానికి చెందిన రైతులు ఐలేని గడీల మురళీధర్​రావు(52), ఐలేని లక్ష్మణ్​​రావు(60) గ్రామంలో బోరు మోటార్లు కాలిపోయినప్పుడు బోరు నుంచి పైకి లాగుతుంటారు.

వీరు తమకు పరిచయం ఉన్న ఇమ్మడి నారాయణ(50)ను తీసుకుని బోరులో నుంచి మోటార్​ను పైకి లాగేందుకు వెంట తీసుకెళ్లారు. తొలుత మరో చోట బోరులో నుంచి మోటార్​ను మురళీధర్​రావు, లక్ష్మణ్​రావు, నారాయణ కలిసి పైకి తీశారు. ఆ తర్వాత స్వామిగౌడ్​ పొలం వద్దకు వెళ్లి అక్కడ కాలిపోయిన మోటార్​ను పైకి లాగే పనులు మొదలు పెట్టారు. ఆ సమయంలో అక్కడ స్వామిగౌడ్​ లేడు. బోరు పైనుంచి కరెంట్​ లైన్​ వైర్లు వెళ్లాయి.

ఆ సమయంలో కరెంట్ సరాఫరా ఉంది. ఈ వైర్లను గమనించకుండా వీరు ముగ్గురూ మోటార్​ను పైకి తీస్తుండటంతో కరెంట్ తీగలకు ఇనుప పైప్​కు తాకి షాక్​తగిలింది. ఇనుప పైపు పట్టుకుని ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. మురళీధర్​రావు, నారాయణ, లక్ష్మణ్​రావు మరణవార్త తెలిసి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మురళీధర్​రావు, ఇమ్మడి నారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్​ వెళ్లి పని చేశారు. ఆ తర్వాత తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నారాయణ నెల రోజుల్లో గల్ఫ్​ వెళ్లాల్సి ఉందని గ్రామస్తులు చెప్పారు.