ఎల్ నినో దెబ్బకు  సీతాఫలం మాయం! వేళకు వర్షాలు కురవక తగ్గిన కాత

ఎల్ నినో దెబ్బకు  సీతాఫలం మాయం! వేళకు వర్షాలు కురవక తగ్గిన కాత

 

  • రాలిన పిందెలు.. ఎదగని కాయలు
  • మార్కెట్‌‌‌‌లో పండ్ల షార్టేజ్
  • గల్లంతయిన గిరిజనుల ఉపాధి
  • రెట్టింపైన సీతాఫలం రేట్లు
  • కనుమరుగవుతున్న చెట్లు

 
మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, గుట్టలు, బంజరు భూముల్లో విరివిగా దొరికే సీతాఫలాలు ఈసారి తగ్గిపోయాయి. అడవులు, గుట్టల విధ్వంసం, చెలకలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడంతో ఇప్పటికే సీతాఫలం చెట్లు మూడోవంతుకు తగ్గిపోగా.. మిగిలిన చెట్లపైనా ఈసారి ఎల్‌‌‌‌నినో ప్రభావం పడింది. సకాలంలో వర్షాలు పడక పూత, కాత దెబ్బతినడంతో పిందె దశలోనే కొన్ని రాలిపోయాయి. వాతావరణ మార్పులతో మరికొన్ని చెట్లపైనే నల్లబారాయి. దీంతో మార్కెట్లలో సీతాఫలాల షార్టేజ్ ఏర్పడింది. అక్కడక్కడ గిరిజనులు తెచ్చి అమ్ముతున్నా రేట్లు రెట్టింపయ్యాయి. దీంతో సామాన్యులు కొనడానికి జంకుతున్నారు.

క్వారీలు, వెంచర్లతో తగ్గుతున్న చెట్లు..

ఒకప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే తెలంగాణవ్యాప్తంగా గుట్టలు, బంజరు భూములు, చేను సెల్కల వెంట ఎటుచూసినా సీతాఫలాల చెట్లు విరగ్గాసేవి. గుట్టలు, చిట్టడవులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాల్లో గంపలకొద్దీ పండ్లు మార్కెట్‌‌‌‌లోకి వచ్చేవి. రుచికి రుచి, హెల్త్‌‌‌‌కు కూడా మంచివి కావడం, అగ్గువకు దొరకడంతో పిల్లలు మొదలుకొని వృద్ధులదాకా ఈ పండ్లను ఇష్టంగా తినేవారు.

వీటి అమ్మకం ద్వారా గిరిజనులు రెండు, మూడు నెలల పాటు ఉపాధి పొందేవారు. క్వారీలతో గుట్టలు ధ్వంసం కావడం, ప్రభుత్వ భూముల అమ్మకంతో బంజరు భూములు, చిట్టడవులు మాయం కావడం, చెల్కలు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్స్‌‌‌‌గా, లేదంటే వెంచర్లుగా మారుతుండడంతో సీతాఫల చెట్లు కనుమరుగవుతున్నాయి.

ఈసారి ఎల్​నినో ఎఫెక్ట్​తో తగ్గిన కాయలు..

సీతాఫలాల చెట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రం వీటికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో గుట్టలు, బంజరు భూములు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా అచ్చంపేట, కొల్లాపూర్, వెల్దండ, ఆమనగల్లు, కడ్తాల్, మిడ్జిల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, గోపాల్‌‌‌‌పేట, రేవల్లి, పాన్‌‌‌‌గల్, వీపనగండ్ల, ఖిల్లాఘణపురం, మహబూబ్‌‌‌‌నగర్, నవాబుపేట, దేవరకద్ర, కోయిల్‌‌‌‌కొండ, హన్వాడ, చిన్నచింతకుంట, మహమ్మదాబాద్, గండీడ్, ధన్వాడ, దామరగిద్ద, మద్దూరు, గట్టు, ధరూరు ప్రాంతాల్లోని గుట్టలు, అటవీ ప్రాంతాల్లో భారీగా సీతాఫలం చెట్లు ఉన్నాయి. ఇక్కడ పండిన పండ్లు హైదరాబాద్ ప్రజల అవసరాలను తీర్చేవి. కానీ ఈసారి ఎల్‌‌‌‌నినో ఎఫెక్ట్‌‌‌‌తో పరిస్థితి తారుమారైంది. సాధారణంగా జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రారంభమైతే జులై చివరి వారం కల్లా చెట్లకు కొత్త చిగురుతోపాటే పూత కూడా వస్తుంది. జులై నుంచి ఆగస్టు మధ్య పూత పిందెగా మారి, సెప్టెంబరు మొదటి వారం కల్లా కాయలు పక్వానికి వస్తాయి. కానీ ఈ ఏడాది ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షాలు గతి తప్పాయి. రోజుల తరబడి చినుకు లేకపోవడం, అధిక టెంపరేచర్ల కారణంగా చెట్లకు పిందెలు దక్కలేదు. చాలా వరకు చెట్ల మీదే మాడిపోయాయి. సాధారణంగా ఒక్కో చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఉండాలి. కానీ ప్రస్తుతం పదికి మించి కాయలు లేవు.

రెండింతలైన ధరలు

సీతాఫలాల దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు అమాంతం పెరిగాయి. గతేడాది 150 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు ఉన్న ఒక పండు రూ.5, రూ.7 వరకు, 250 గ్రాముల పండు రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయించారు. వంద కాయలు ఉన్న బాక్సు (పెద్ద గంప)ను రూ.200 నుంచి రూ.250 వరకు అమ్మారు. కానీ ఈ ఏడాది 150 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువు ఉన్న పండ్లను ఒక్కోటి రూ.30 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు. వంద కాయలు ఉన్న గంపను రూ.450 నుంచి రూ.550 వరకు ధర చప్తున్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల రేట్లు మరింత ఎక్కువున్నాయి.  

ఉపాధి కోల్పోతున్న గిరిజనులు

పాలమూరు జిల్లాలోని వివిధ తండాలకు చెందిన గిరిజనులు ఏటా సీతాఫలాలు సేకరించి ఉపాధి పొందేవారు. సెప్టెంబరు మొదటి వారం నుంచి డిసెంబరు చివరి వారం వరకు వీటి దిగుబడి ఉండడంతో గుట్టలు, అటవీ ప్రాంతాలకు వెళ్లి కాయలను సేకరించేవారు. కొందరు మహబూబ్‌‌‌‌నగర్, జడ్చర్ల పట్టణాలతో పాటు ప్రధాన రహదారులు, నేషనల్ హైవేల వెంట కుప్పలుగా పోసి అమ్మేవారు. మరికొందరు హైదరాబాద్ నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయించేవారు. కానీ ఈ ఏడాది సెప్టెంబరు ముగిసినా కాయలు లేక, ఉన్నవి క్వాలిటీ లేక ఉపాధి కోల్పోతున్నారు. 

 కాలచక్రం తప్పడం వల్లే..

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సీతాఫలం చెట్ల కాలచక్రం తప్పింది. ఈ ప్రభావం దిగుబడిపై పడి సెప్టెంబరు నాటికి రావాల్సిన పండ్లు ఇప్పటికీ రాలేదు. వర్సాలు లేక, ఉష్ణోగ్రతలు పెరిగి పిందెలు, పక్వాని రాని కాయలు పెద్దసంఖ్యలో రాలిపోతున్నాయి. సహజంగానే సీతాఫలంలో కేవలం రెండు శాతం పూలు మాత్రమే కాయలుగా మారుతాయి. అలాగే తీవ్రమైన పొడి వాతావరణం వల్ల గాలిలో తేమశాతం పడిపోయింది. ఇది పుప్పొడి ఎండిపోవడానికి, పూత రాలిపోవడానికి దారితీసింది.- కె.వేణుగోపాల్, జిల్లా ఉద్యానవన, 

పట్టు పరిశ్రమ అధికారి, మహబూబ్‌‌‌‌నగర్ 
పసరు కాయలే ఉన్నాయి

ఏటా అడవికి వెళ్లి సీతాఫలాలను తెంపుకొచ్చి అమ్ముతుంటిమి. ఈ సారి చెట్లకు కాయలే లేవు. ఉన్నవి కూడా చాలా వరకు పసరు కాయలే. పక్వానికి రాలేదు. ఒక్కో చెట్టుకు పది, పన్నెండు మాత్రమే ఉన్నై. నిరుడు విరగ కాసినయ్. కాయలను తెంపుకొచ్చి పాలమూరులో అమ్మితే బాగా లాభం వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు.
- చెన్నమ్మ, రుద్రారం గ్రామం, నవాబుపేట మండలం 

ధర చూసి కొంటలేరు 

మా చెల్కలనే సీతాఫలం చెట్లు ఉన్నవి. కాయలు అంతగా లేవు. ఉన్న కాయలకు తెంపి అమ్మకానికి తీసుకొచ్చిన. పొద్దన్నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చున్న. అందరూ అడిగి పోతున్నరే గాని, ధరలు ఎక్కువున్నయని ఎవరూ కొంట లేరు.
- శివమ్మ, మహమ్మదాబాద్