నీ ఫోన్ను ఎందుకు, ఎవరు ఫార్మాట్ చేశారు : సిట్ అధికారులు

నీ ఫోన్ను ఎందుకు, ఎవరు ఫార్మాట్ చేశారు : సిట్ అధికారులు
  • నువ్వు అమెరికాలో ఉండగా హైదరాబాద్​లో అలా చేయాల్సిన అవసరమేమొచ్చింది?
  • ఎస్​ఐబీ మాజీ చీఫ్​ప్రభాకర్​రావును ప్రశ్నించిన సిట్​
  • ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్‌‌‌‌ విచారణ కొనసాగుతున్నది. నాలుగో రోజు సోమవారం విచారణలో భాగంగా ఆయన సెల్‌‌‌‌ఫోన్ ఫార్మాట్‌‌‌‌ గురించే సిట్​ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన ఒక సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ ‌‌‌‌ఈ ఏడాది ఏప్రిల్​లో హైదరాబాద్‌‌‌‌లోని ఆయన ఇంట్లో ఫార్మాట్‌‌‌‌  చేసినట్టు ఇప్పటికే సిట్​ అధికారులు గుర్తించారు. 

కాగా, సెల్‌‌‌‌ఫోన్ ఫార్మాట్‌‌‌‌ అయిన సమయంలో ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు అమెరికాలో ఉన్నారు. దీంతో అధికారికంగా వినియోగించిన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ను ఫార్మాట్‌‌‌‌ చేసింది ఎవరనే కోణంలో సిట్‌‌‌‌ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల12న ప్రభాకర్ రావు సిట్‌‌‌‌ ఎదుట సరెండర్ అయ్యారు. 19వ తేదీ వరకు కస్టోడియల్ విచారణ విధించడంతో..  ప్రభాకర్ రావు సిట్ కస్టడీలో ఉన్నారు. జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌లోని సిట్‌‌‌‌ ఆఫీసులో  ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ విచారిస్తున్నది. 

ఆ టైమ్​లో ఇంట్లో ఎవరున్నారు?

సిట్‌‌‌‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు ఇవ్వడంలేదని సమాచారం. ఇప్పటికే ఆరుసార్లు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్లలో ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నట్టు ఆయన చెప్తున్నట్టు తెలిసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కస్టడీలో సేకరించిన పలు విషయాల ఆధారంగా నాలుగో రోజు ప్రభాకర్ రావును సిట్​ అధికారులు ప్రశ్నించారు. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైన తర్వాత  ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. 

కాగా, ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌గా ఉన్న సమయంలో ఆయన వినియోగించిన ఒక సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌  హైదరాబాద్‌‌‌‌లోని ఆయన  నివాసంలో ఏప్రిల్‌‌‌‌లో ఫార్మాట్‌‌‌‌ చేసినట్లు ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్టులో గుర్తించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారు.. సెల్‌‌‌‌ఫోన్ ఫార్మాట్‌‌‌‌ చేసేందుకు ఎవరు సహకరించారని, ఎవరు చేయమన్నారనే  కోణంలో సిట్ ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ నుంచి ఇప్పటికే సేకరించిన వాట్సాప్‌‌‌‌  కాలింగ్‌‌‌‌, చాటింగ్ డేటా రిపోర్ట్‌‌‌‌తో పాటు ఐపీ అడ్రెస్‌‌‌‌ల ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. 

కాగా, అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుకు వచ్చిన ఆదేశాలతోనే నాటి ఎస్‌‌‌‌ఓటీ చీఫ్‌‌‌‌ ప్రణీత్‌‌‌‌రావు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడినట్లు సిట్‌‌‌‌ వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిసింది. ఫోన్​ ట్యాపింగ్​ను ఎవరు చేయమన్నారని ప్రభాకర్​రావును సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు వినియోగించిన మొబైల్ ఫోన్లు, క్లౌడ్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లోని డేటాను డిలీట్‌‌‌‌ చేయాల్సిన అవసరం ఏముందనే కోణంలో సిట్‌‌‌‌ కస్టోడియల్‌‌‌‌ ఎంక్వైరీ కొనసాగుతున్నది.