వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ను హింసించినా..వారిని పట్టించుకోకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. అనారోగ్య సమస్యల ఉన్న పేరెంట్స్ ను రోడ్డును పడేయడం దారుమన్నారు. కన్నవాళ్ల బాగోగులు చూడడం పిల్లల కనీస ధర్మం అని అన్నారు. ఇటీవల తల్లిదండ్రులను పట్టించుకోకుండా..వారిని వదిలేయడం వంటి సంఘటనలను ఉద్దేశించిన సజ్జనార్ ట్వీట్ చేశారు.
‘ నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశా. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం. ఇది చర్చలకు తావులేని వారి హక్కు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుంది. నేడు మీరు ఏది విత్తుతారో.. వృద్ధాప్యంలో అదే కోసుకుంటారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు అని ట్వీట్ చేశారు సీపీ సజ్జనార్.
